PM Surya Ghar Yojana: ఈ కేంద్ర పథకంతో ఉచిత కరెంట్.. ఏడాదికి రూ. 32 వేలు ఆదా.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Roof Top Solar: ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన’లో కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల చొప్పున సబ్సిడీ అందజేస్తోంది. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆశించిన స్పందన రాలేదని కేంద్రం తెలిపింది.
PM Surya Ghar Yojana: రోజురోజుకు పెరుగుతున్న కరెంటు బిల్లులతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. దీని సాయంతో ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకుని ఉచిత విద్యుత్ పొందవచ్చు. జీవితాంతం ఉచిత కరెంటు పొందడమే కాకుండా మిగులు కరెంటును అమ్ముకుని ఆదాయం కూడా పొందవచ్చు. అదే ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన’ (PM Surya Ghar yojana). దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
రూ.78వేల సబ్సిడీ
ఒక్కో ఇంటి పై గరిష్టంగా 3 కిలోవాట్ల వరకు అమర్చుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల చొప్పున సబ్సిడీ అందజేస్తోంది. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆశించిన స్పందన రాలేదని కేంద్రం తెలిపింది. ఈ పథకంపై తెలుగు ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.32 వేలు ఆదా అవుతుందని, నిరంతర విద్యుత్ పొందవచ్చని చెప్పారు. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
బ్యాంక్ లోన్ కూడా..
పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా కేంద్రం కిలోవాట్‌కు రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.18 వేలు సబ్సిడీ అందజేస్తుంది. అంటే ఇంటిపై 3 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లను అమర్చాలంటే రూ.1.45 లక్షలు ఖర్చవుతుంది. దీనిపై కేంద్రం రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఎలాంటి తనఖా లేకుండా బ్యాంకు ద్వారా రుణంగా తీసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ బ్యాంకులైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యూబీఐలు ఈ రుణాలను ఇస్తున్నాయి.
ఉత్పత్తి అయిన విద్యుత్ అమ్ముకునే సదుపాయం
నెలకు 0-150 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి 1-2 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్... 150-300 యూనిట్లు కానీ 2-3 కిలోవాట్ ప్యానెల్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ పైన కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ సబ్సిడీ కేవలం రూ. 78 వేలు. ఈ పథకం ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చు. మిగిలిన విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా ఇతరులకు విక్రయించవచ్చు. సూర్య ఘర్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 1 కిలోవాట్‌కు 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం నెలకు రూ.1000 బిల్లు వస్తుంది. సోలార్ ప్యానెల్స్ ఖర్చు రూ.338 మాత్రమే. అంటే రూ. 8 వేల ఆదాయం ఉంటుంది. 240 యూనిట్లు వినియోగించే వారికి నెలకు రూ.2 వేలు బిల్లు వస్తుంది. రూ.333 సోలార్ ప్యానెల్ల ద్వారా ఖర్చు అవుతుంది. 360 యూనిట్లు వాడే వారికి ఏడాదికి రూ.32 వేలు ఆదా అవుతుంది.
దరఖాస్తు విధానం ఇలా..
* PM సూర్యఘర్ పోర్టల్ pmsuryaghar.gov.inలో నమోదు చేసుకోండి. మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా సంస్థను ఎంచుకోండి. విద్యుత్ కనెక్షన్ నంబర్, ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఇవ్వాలి.
* ఆ తర్వాత మీరు కన్జ్యూమర్ నంబర్, ఫోన్ నంబర్‌తో లాగిన్ కావాలి. రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లయ్ చేయాలి. ఫారమ్‌ను పూరించండి. డిస్కామ్ నుండి అనుమతి కోసం వేచి ఉండండి. అనుమతులు పొందిన తరువాత, డిస్కమ్ గుర్తింపు పొందిన విక్రేతల నుండి సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత పోర్టల్‌లో వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
* నెట్ మీటర్‌ను అమర్చిన తర్వాత డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత కమీషన్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఈ నివేదికను స్వీకరించిన తర్వాత, క్యాన్సిల్ చెక్కును మీ బ్యాంక్ ఖాతా వివరాలతో పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. 30 రోజుల్లో సబ్సిడీ వస్తుంది.
Also Read: టర్మ్ ఇన్సూరెన్స్‌ల్లో 'ఆమె' హవా - టాప్ ప్లేస్‌లో హైదరాబాద్, గుంటూరు లేడీస్