Modi America Tour: భారత ప్రధాని మోదీని కలిసేందుకు ట్రంప్ ఉత్సాహం.. ఎందుకంటే..?
Trump Wants to meet Modi: అమెరికా పర్యటనకు వస్తున్న భారతీయ ప్రధాని మోదీని కలిసేందుకు ట్రంప్ ఎదురు చూస్తున్నారు. మోదీతో సమావేశం తనకు మరింత మైలేజీనిస్తుందని ఆశిస్తున్నారు ట్రంప్.
PM Modi US Tour: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల మద్దతు ఎవరికి..? సహజంగానే ఇండియన్ అమెరికన్ అయిన కమలా హ్యారిస్ కే వారి మద్దతు ఉంటుంది..ఆ మద్దతు తనకు కూడా కావాలంటున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఆయన్ను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రధాని మోదీ మూడు రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభతో పాటు, క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్తున్నారు. ఈమేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ అమెరికాలో ప్రధాని పర్యటన షెడ్యూల్ ని ప్రకటించింది. ఈనెల 21న క్వాడ్ సదస్సుకి హాజరు కానున్నారు. ఈనెల 22న న్యూయార్క్ లో ప్రవాస భారతీయులతో సమావేశంలో పాల్గొంటారు. ఈనెల 23న ఐక్యరాజ్య సమితి సభ నిర్వహించే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కు హాజరు అవుతారు. ఇదీ క్లుప్తంగా ప్రధాని మోదీ షెడ్యూల్. అయితే ప్రైవేట్ మీటింగ్స్ కి ప్రత్యేకంగా ఆయన సమయం కేటాయిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో భేటీ అవుతానంటున్నారు.
ఎందుకీ భేటీ..?
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. డెమొక్రాటిక్ అభ్యర్థిగా బైడెన్ పక్కకు తప్పుకోవడంతో పోటీ మరింత పెరిగింది. ఆయన స్థానంలో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమలా హ్యారిస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వరుస దాడులలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సింపతీ ఓట్లతో గట్టెక్కుతాననే నమ్మకంతో ఉన్నారు. అయితే ఇండియన్ అమెరికన్స్ ఓట్లు కూడా కీలకం కావడంతో ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇండియన్ మూలాలున్న కమలా హ్యారిస్ కే ఆ ఓట్లు గుంపగుత్తగా పడతాయనే అంచనాలున్నాయి. అయినా కూడా ట్రంప్ ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడంలేదు. అమెరికా పర్యటనకు వస్తున్న భారతీయ ప్రధాని మోదీని కలిసేందుకు ట్రంప్ ఎదురు చూస్తున్నారు. మోదీతో సమావేశం తనకు మరింత మైలేజీనిస్తుందని ఆశిస్తున్నారు ట్రంప్.
Also Read: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్ వద్ద కలకలం
2020లో అమెరికా ప్రధాని హోదాలో డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చారు. అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీలో ఆయన పర్యటించారు. ప్రధాని మోదీ - ట్రంప్ కాంబినేషన్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇటీవల ట్రంప్ పై జరిగిన దాడిని కూడా మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో మోదీ-ట్రంప్ మధ్య స్నేహం ఇంకా అలాగే ఉందని అంటున్నారు కొందరు. అయితే ఈ స్నేహం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
ఇక ప్రధాని మోదీ హాజరవుతున్న క్వాడ్ సదస్సు విషయానికొస్తే.. క్వాడ్రిలేటరల్ సెక్యురిటీ డైలాగ్ గా దీన్ని అభివర్ణిస్తారు. 2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే.. క్వాడ్ ను లాంఛనంగా ప్రారంభించారు. భారత్ తో పాటు.. ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ దేశాలు ఇందులో భాగస్వాములు. చైనాను అడ్డుకోవడం కోసమే క్వాడ్ మొదలైందనే ఆరోపణలున్నాయి. క్వాడ్ బృందాన్ని ఏసియన్ నాటోగా చైనా అభివర్ణించడం విశేషం.