Ambedkar Jayanti 2024: అంబేడ్కర్‌కి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువే, ఎవరికీ తెలియని మరో కోణం ఇది
Ambedkar Jayanti 2024: అంబేడ్కర్‌కి హాస్య చతురత ఎక్కువ అని ఆయన పర్సనల్ అసిస్టెంట్ అప్పట్లో చాలా సందర్భాల్లో చెప్పారు.
BR Ambedkar Birth Anniversary 2024: అంబేడ్కర్ అనగానే గుర్తొచ్చేదంతా మనకి తెలిసింది మాత్రమే. ఆయన చాలా మేధావి అని, అట్టడుగు వర్గం నుంచి వచ్చి భారత రాజ్యాంగకర్తగా ఎదిగారని గొప్పగా చెప్పుకుంటాం. కానీ...ఇదంతా ఓ కోణం మాత్రమే. మరో కోణంలో ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు (Interesting Facts About Ambedkar) ఎన్నో ఉన్నాయి. ఆయనకు కళలు అంటే చాలా ఇష్టం. సంగీతం, పెయింటింగ్‌తో ఎక్కువ సమయం గడిపే వారు. వీటితో పాటు గార్డెనింగ్ కూడా చేసే వారు. కానీ...ఎక్కువ సమయం మాత్రం పాటలు వినడం, పెయింటింగ్స్ వేయడానికే కేటాయించే వారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే...ఆయన వద్ద చాలా రకరకాల ఆర్ట్‌ఫామ్స్ ఉండేవి. ఎక్కడికి వెళ్లినా అక్కడ నచ్చిన ఆర్ట్‌ని పట్టుకొచ్చేవారు. అలా ఎన్నో పెయింటింగ్స్ సేకరించారు. చాలా రోజుల పాటు సాధన చేశారు కూడా. బుద్ధుడి బొమ్మలు గీశారు. బుద్ధుడితో పాటు ప్రకృతి బొమ్మలు గీసేందుకు ఎక్కువగా ఇష్టపడే వారు అంబేడ్కర్. జంతువులు, పక్షుల చిత్రాలు గీసేందుకు ఎక్కువ మక్కువ చూపించే వారు.
ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్‌లో ఉన్న అంబేడ్కర్ ఇంట్లో ఇప్పటికీ ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఆయిల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక సంగీతం అన్నా ఆయన ప్రాణం పెట్టే వారు. కేవలం వినడమే కాదు. నేర్చుకోవాలనీ ఆసక్తి చూపించారు. అలా వయోలిన్ నేర్చుకున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే చాలా శ్రద్ధగా నేర్చుకునే వారని ఆయన వయోలిన్ గురువు బలవంత్ సాతే (Balwant Sathe) అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఆరోగ్యం క్షీణించిన రోజుల్లో కూడా సాధన వదల్లేదని వివరించారు.
సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువే..
సంగీతం,పెయింటింగ్‌తో పాటు అంబేడ్కర్‌కి నచ్చిన వ్యాపకం గార్డెనింగ్. రకరకాల మొక్కలు పెంచుకునే వారు. గార్డెన్ అందంగా కనిపించేలా వెరైటీ పూలనూ పెంచుకునే వారు. ఇక అంబేడ్కర్‌లో మనం ఎవరూ ఊహించని మరో కోణం ఉంది. ఆయనకి హాస్య చతురత (Sense of Humor) ఎక్కువ. బంధువులు,స్నేహితులతో బోళాగా మాట్లాడేవారు. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా మనస్పూర్తిగా నవ్వుకునే వారు. అంబేడ్కర్ పర్సనల్ అసిస్టెంట్ నానక్ చందూ రత్తు (Nanak Chand Rattu) ఆయనలోని సెన్సాఫ్ హ్యూమర్ గురించి పలు సందర్భాల్లో చెప్పారు. జోక్‌లు వేయడమే కాదు. విని ఆస్వాదించేందుకూ అంబేడ్కర్ చాలా ఇష్టపడే వారని చెప్పారు నానక్. ఇక గ్రామాల్లో బాగా వినిపించే సామెతలనూ అడిగి మరీ చెప్పించుకునే వారట.
ఎప్పుడైనా, ఎక్కడైనా టెన్షన్ వాతావరణం ఉంటే అలాంటి సమయాల్లోనూ తన సెన్సాఫ్ హ్యూమర్‌తో అందరినీ నవ్వించి ఒత్తిడికి దూరం చేసే వారట. ఓసారి అంబేడ్కర్ డ్రెసింగ్ స్టైల్‌పై ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నప్పుడు అక్కడి డ్రెస్ స్టైల్‌నే అనుసరించాలని చెప్పాడు. భారత దేశ వేషధారణని Nationalist Dress అంటూ హేళన చేశాడు. అప్పుడు అంబేడ్కర్ "నేషనలిస్ట్ డ్రెస్" అంటే ఏంటని అడిగారు. అందుకు ఆ వ్యక్తి "మీ పూర్వీకులు ఏవైతే వేసుకున్నారో అవి" అని సమాధానం చెప్పాడు. అప్పుడు వెంటనే అంబేడ్కర్ "ప్రతిసారీ పూర్వీకులనే అనుసరించలేం. అప్పట్లో ఆడమ్ అండ్ ఈవ్ దుస్తులు లేకుండానే తిరిగారట. అలా అని ఇప్పుడు మీరు అలా తిరిగితే బాగోదు కదా" అని బదులిచ్చాడు. ఆయన సెన్సాఫ్ హ్యూమర్‌కి ఇదో ఉదాహరణ.