Air India: ఎయిరిండియా విమానంలో తెరుచుకున్న ‘ర్యాట్’.. బర్మింగ్‌హామ్– న్యూఢిల్లీ విమానం రద్దు
ఎయిరిండియా బోయింగ్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. ఎమర్జెన్సీలో వాడే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (RAT) అకస్మాతుగా బయటకు వచ్చింది. అయినా సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఎయిరిండియా బోయింగ్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. అమృత్‌సర్ నుంచి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన బోయింగ్ 787–8 డ్రీమ్ లైనర్ విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న వేళ.. ఎమర్జెన్సీలో వాడే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (RAT) అకస్మాతుగా బయటకు వచ్చింది. దీంతో సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురైనా.. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.
బర్మింగ్‌హామ్– న్యూఢిల్లీ విమానం రద్దు
విమానం ల్యాండింగ్ తర్వాత తనిఖీల కోసం దాన్ని నిలిపివేశారు. దీని ఫలితంగా బర్మింగ్‌హామ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన తదుపరి విమానం రద్దయ్యింది. ర్యాట్ అనేది విమానంలోని చిన్న పరికరం. సాధారణంగా ముడుచుకుపోయి ఉండే ఇది.. ఇంజిన్ వైఫల్యం, విద్యుత్ ఉత్పత్తి చిలిచిపోవడం లాంటి అత్యవసర స్థితిలో తెరుచుకుంటుంది.
స్పందించిన ఏయిరిండియా
ఈ ఘటనపై ఎయిర్ఇండియా స్పందించింది. ‘అక్టోబర్ 04న అమృత్‌సర్ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన AI117 విమానం ల్యాండింగ్ సమయంలో రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) పనిచేయడాన్ని సిబ్బంది గుర్తించారు. విమానంలోని అన్ని విద్యుత్, హైడ్రాలిక్ పారామీటర్లు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. విమానం బర్మింగ్‌హామ్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. తదుపరి తనిఖీల కోసం విమానం నిలిపివేశాం. ఢిల్లీకి వెళ్లే AI114 విమానాన్ని రద్దు చేశాం. అతిథులకు వసతి కల్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
ఇటీవల అహ్మదాబాద్‌లో బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 241 మంది మృతిచెందారు. ఈ ఘటనకు కొన్ని క్షణాల ముందు విమానానికి ఉండే ర్యాట్ బయటకు వచ్చి పనిచేసినట్లు గుర్తించారు. అయితే విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.





















