Rajasthan Congress Crisis: రాజస్థాన్ పరిణామాలపై అధిష్ఠానం సీరియస్, ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు!
Rajasthan Congress Crisis: గహ్లోత్ వర్గానికి చెందిన ముగ్గురు నేతలపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు పంపింది.
Rajasthan Congress Crisis:
షోకాజ్ నోటీసులు..
రాజస్థాన్‌లో రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయో చూస్తూనే ఉన్నాం. సీం గహ్లోత్ వర్సెస్ డిప్యుటీ సీఎం సచిన్ పైలట్ అన్నట్టుగా యుద్ధం నడుస్తోంది. గహ్లోత్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ...సీఎంగానూ కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధిష్ఠానం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. ఈ వివాదం కాస్త ముదిరి పాకాన పడింది. గహ్లోత్ వర్గీయులు దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటమూ సంచలనమైంది. ఈ కమ్రంలోనే....అధిష్ఠానం వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే...రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ అజయ్ మాకెన్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన రిపోర్ట్‌ని సోనియాకు అందించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై తప్పనిసరివేటుగా వేయాలని చెప్పారు. చీఫ్ విప్ మహేశ్ జోషి, RTDC చైర్మన్ ధర్మేంద్ర రాథోర్, శాంతి ధరివాల్...ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి...తదుపరి సీఎం ఎవరన్న దానిపై చర్చించారు. తీర్మానం కూడా చేశారు. అధిష్ఠానం అనుమతి లేకుండా ఇలా రహస్య సమావేశం పెట్టుకోవటంపై సోనియా గుర్రుగా ఉన్నారు. ఈ ముగ్గురు నేతలకూ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు పంపింది. "క్రమశిక్షణా రాహిత్యం" కింద ఈ నోటీసులు పంపడమే కాకుండా...10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ముగ్గురు నేతలూ... సమావేశం ముగిశాక కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. 2020లోనూ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు రావటాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి మద్దతునిచ్చిన ఎమ్మెల్యేలంతా ఈసారి సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సచిన్ పైలట్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టకుండా...భారీ ఎత్తున ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని హెచ్చరికలూ చేశారు.
ఊహించని తిరుగుబాటు..
సోనియా గాంధీతో సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నా..వాటినీ ఖాతరు చేయలేదు రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు. నెక్స్ట్ సీఎం ఎవరో తేలేంత వరకూ...సోనియాతో సమావేశం అవకపోవటమే మంచిదని భావిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై నివేదిక ఇచ్చే ముందు అజయ్ మాకెన్ ఆ ముగ్గురు నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వైఖరి పట్ల కాంగ్రెస్ అధినేత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు ఏబీపీ న్యూస్‌కి తెలిపాయి."అశోక్ గహ్లోత్ ఇలా చేశారా? గహ్లోత్ నుంచి ఇది ఊహించలేదు" అని సోనియా గాంధీ సమావేశంలో రాజస్థాన్ ఇంచార్జ్ అజయ్ మాకెన్, ఖర్గేలకు చెప్పినట్లు సమాచారం. రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభంపై మంగళవారంలోగా లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని సోనియా గాంధీ కోరారు. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరున్న అశోక్ గహ్లోత్.. అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తారని సోనియా, రాహుల్ గాంధీ అసలు ఊహించలేదు. ఒకవైపు భారత్ జోడో యాత్ర విజయవంతంగా నడుస్తోందని.. కాంగ్రెస్ కార్యకర్తల్లో పునరుత్తేజం కలిగిస్తోందని పార్టీ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాము ఎంపిక చేయాలనుకున్న నాయకుడే ధిక్కార వైఖరి అవలంబించడంపై వారు ఆగ్రహంతో ఉన్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబం చేతిలో పార్టీ పగ్గాలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి రాజస్థాన్ పరిణామాలే తార్కాణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారట. అందుచేత ఇకనైనా రాహుల్ మనసు మార్చుకుని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీనియర్ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
Also Read: KCR National Party : జాతీయ పార్టీపై టీఆర్ఎస్ సైలెంట్ - దసరాకు లేకపోతే ఇక లేనట్లే !?