Aadhaar Enrolment: ఇకపై ఆసుపత్రుల్లో నవజాత శిశువులకు ఆధార్ నమోదు.. ఎలా చేస్తారంటే
నవజాత శిశువులకు ఆధార్ నంబర్లను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తెలిపింది. ఈ మేరకు త్వరలో ఆసుపత్రుల్లో ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
ఆసుపత్రుల్లో నవజాత శిశువులకు ఆధార్ నమోదును త్వరలో అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నవజాత శిశువులకు ఆధార్ నంబర్లను ఇవ్వడానికి జనన ధృవీకరణ పత్రంతో టై-అప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు UIDAI వెల్లడించింది. అయితే నవజాత శిశువుకు ఆధార్ ఇచ్చే సమయంలో తల్లిదండ్రులలో ఒకరి గుర్తింపు కార్డు కూడా అవసరం ఉంటుంది. ఆధార్ అనేది.. 12 అంకెలు గల సంఖ్య. గుర్తింపు, చిరునామా.. ఇలా ప్రతిదాంట్లో ఇప్పుడు ఆధార్ అనేది ముఖ్యమైపోయింది.
"భారత్ లోని పెద్దల్లో 99.7% మందికి ఆధార్ నమోదై ఉంది. ఇప్పటి వరకు 131 కోట్ల మందికి ఆధార్ ఇచ్చాం. ఇప్పుడు నవజాత శిశువులకు ఆధార్ నమోదు చేయించడమే మా ప్రయత్నం. అప్పుడే పుట్టే పిల్లలకు ఆధార్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం.' అని UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ గార్గ్ చెప్పారు.
బిడ్డ పుట్టినప్పుడు తీసిన ఫొటో ఆధారంగా.. తర్వాత ఆధార్ కార్డ్ ఇస్తామని గార్గ్ వెల్లడించారు. ఇందుకోసం జనన ధృవీకరణ పత్రంతోపాటుగా తల్లిదండ్రుల గుర్తింపు కార్డు కూడా కావాల్సి ఉంటుందన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ ను వారి తల్లిదండ్రుల ఆధార్‌కు లింక్ చేస్తారు. పిల్లల వయస్సు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత.. బయోమెట్రిక్ ద్వారా మళ్లీ ఇస్తామని గార్గ్ వెల్లడించారు.
మేం మా భారతీయులందరికీ ఆధార్ నంబర్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. చాలా మందికి ఆధార్ నంబర్లు లేవని మాకు తెలిసింది. గత సంవత్సరం మారుమూల ప్రాంతాల్లో 10,000 క్యాంపులు నిర్వహించాం. 30 లక్షల మంది ఆధార్ కోసం నమోదు చేసుకున్నారు.
- సౌరభ్ గార్గ్, UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ఐదేళ్ల తర్వాత ఎలా అప్లై చేయాలి
ఐదేళ్లలోపు ఇచ్చిన ఆధార్‌కార్డు నంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే ఆధార్ వివరాల అప్‌గ్రేడ్ కోసం తల్లిదండ్రులు ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.
పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డుతో పాటు పిల్లల స్కూల్ ఐడెంటిటీ కార్డు లేదా బోనఫైడ్ సర్టిఫికెట్‌ను దరఖాస్తుతో పాటు సమర్పించాలి.
ఈసారి పిల్లల నుంచి వేలిముద్రలు, ఐరిష్ స్కాన్ సేకరిస్తారు. పిల్లలకు 15 ఏళ్లు నిండిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ డేటాను అప్‌గ్రేడ్ చేయించాల్సి ఉంటుంది.
Also Read: Fact Check: 'అంతర్జాతీయ కోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ దల్వీర్ భండారీ'.. ఈ వైరల్ వార్తలో నిజమెంత?