జుట్టు రాలిపోతోంది, పెళ్లికి అమ్మాయిలు దొరకడం లేదు, మానసిక క్షోభతో యువకుడు ఆత్మహత్య!
రోజులు గడుస్తున్న కొద్దీ, ఆరోగ్యం క్షీణించింది, దాని ఫలితంగా తీవ్ర నిరాశకు గురయ్యాడు. పెళ్లి వాయిదా పడుతూనే ఉంది. దీంతో దిక్కుతోచని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కేరళలోని కోజికోడ్ జిల్లా అథోలికి చెందిన 29 ఏళ్ల మెకానిక్ జుట్టు రాలడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జుట్టు రాలడం వల్ల ఆత్మహత్య
మెకానిక్ ప్రశాంత్‌కు జుట్టు రాలిపోతోంది. బట్టతల ఉందని చాలా మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంత్.. సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్ సూసైడ్ లెటర్‌ను సోమవారం అథోలీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లెటర్ చదివిన తర్వాత జుట్టు రాలడమే ప్రశాంత్ మరణానికి కారణమని వెల్లడైంది. జుట్టు రాలిపోకుండా ప్రశాంత్ చికిత్స కూడా తీసుకున్నాడు. అయినా జుట్టు రాలడం తగ్గలేదు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా జుట్టు కోల్పోయినట్లు కోజికోడ్‌లో ప్రశాంత్‌కు చికిత్స చేసిన వైద్యులు చెప్పారు. జుట్టు రాలకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న అన్ని చికిత్సలను కూడాా ప్రశాంత్ తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలుస్తోంది.
పెళ్లి వాయిదా
సూసైడ్ నోట్‌లో ఇంకా చాలా అంశాలను ప్రశాంత్ వివరించాడు. 2014 నుంచి జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నట్టు వివరించాడు. జుట్టు రాలడం నివారణ కోసం కోజికోడ్‌లోని స్కిన్ స్పెషాలిటీ సెంటర్ సలహా మేరకు మందులు వాడుతున్నట్టు పేర్కొన్నాడు. "రోజులు గడుస్తున్న కొద్దీ, నా ఆరోగ్యం క్షీణించింది, దాని ఫలితంగా తీవ్ర నిరాశకు గురయ్యాను. బట్టతల కారణంగా అమ్మాయిలు దొరక్కపోవడంతో నా పెళ్లి వాయిదా పడుతూనే ఉంది' అని రాసుకొచ్చాడు.
ఔషధాలే శరీరాన్ని మరింత దిగజార్చాయి.
జుట్టు రాలుతుందని చికిత్స కోసం వెళ్లిన ప్రతి చోట కూడా వైద్యులు మాయ మాటలు చెప్పారని... చాలా ఖర్చు పెట్టినట్టు వెల్లడించాడు ప్రశాంత్. వాళ్ల తప్పుడు హామీల వల్ల చాలా నష్టపోయినట్టు వివరించాడు. ఎవరెవరి వద్ద చికిత్స తీసుకొని మోసపోయాడో కూడా చెప్పాడు. మొదట చికిత్స తీసుకున్నప్పుడు జుట్టు రాలడం ఒకటే సమస్యగా ఉండేదని... ఆ మందు వాడకం ఎక్కువయ్యాక ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడినట్టు ప్రశాంత్ తెలిపాడు.
కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోతాయి
"మందులు తీసుకున్న తర్వాత, కనుబొమ్మ వెంట్రుకలు కూడా రాలిపోవడం ప్రారంభించాయి, ఇది నా మనస్సును పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. నేను దీని గురించి వైద్యుడికి తెలియజేశాను, కానీ అతను నాకు మళ్ళీ ఇతర మందులు ఇచ్చాడు. అందుకే నేను పండుగలకు హాజరుకావడం, స్నేహితులను కలవడం మానేశాను."
ఇన్వెస్టిగేషన్ తో సంతృప్తి చెందకపోవడం
ప్రశాంత్ మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఇప్పటికే అథోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు సంతృప్తికరంగా లేదని బంధువులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగుతోందని చెబుతున్నారు. అసహజ మరణంపై కేసు నమోదు చేసి, వైద్యుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వైద్య నిర్లక్ష్యం లేదని, రాబోయే రోజుల్లో విచారణ జరుపుతామని చెప్పారు.
Also Read:నిగనిగలాడే జుట్టు కోసం కరివేపాకు - ఈ చిట్కాలు పాటిస్తే పొడవైన జుట్టు మీ సొంతం
Also Read: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...