Supreme Court Collegium: సుప్రీం కోర్టు జడ్జిలుగా 9 మంది పేర్లు సిఫార్సు: లిస్టులో జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమ కోహ్లీ
కొత్తగా తొమ్మిదిమంది న్యాయమూర్తులు దేశ అత్యున్నత న్యాయస్థానంలో బాధ్యతలను స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు పేర్లను సిఫారసు చేసింది.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియాయమకానికి సంబంధించి 9 మంది జడ్జిల పేర్లను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. సిఫార్సు చేసిన తొమ్మిది మంది పేర్లను సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో ఉంచడం ద్వారా అన్ని ఊహాగానాలకు స్వస్తి చెప్పింది కొలీజియం. ఈ జాబితాలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.
2027లో సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే ఛాన్స్ ఉన్న కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లను కేంద్రానికి కొలీజియం సిఫారసు చేసింది.
సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి. రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎస్.ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ పేర్లు లిస్టులో ఉన్నాయి. సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న తెలుగు న్యాయవాది పి.ఎస్.నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ప్రతిపాదించింది.
కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాను ఆమోదించాల్సి ఉంది. ఆ వెంటనే వారంతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగైదు రోజుల్లో పూర్తి కావచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదించడం దాదాపు ఖాయమైనట్టే. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను కేంద్రం ఆమోదిస్తే దాదాపు రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకాలు చేపట్టినట్టవుతుంది.
మీడియా ఊహా కథనాలపై సీజేఐ ఏమన్నారంటే..
అధికారిక ప్రకటనకు ముందే కొలీజియం సిఫారుసలపై మీడియాలో వార్తలు రావడం దురదృష్టకరమన్నారు భారత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇలా రావడం వల్ల చాలా సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు మీడియా చాలా బాధ్యతాయుతంగా మసులుకోవాలని సూచించారు. మీడియా హక్కులు, స్వేచ్ఛను తాము గౌరవిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు మీటింగ్‌లో జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.