HDI Index Ranking: భారతీయుల ఆయుర్ధాయం తగ్గుతోంది - మానవాభివృద్ధి సూచిక రిపోర్టులో సంచలన విషయాలు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల కారణంగా మానవ ఆయుర్ధాయం తగ్గుతోందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ లో భారత్ స్థానం 132కి పడిపోయింది.
HDI Index Ranking: : ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) నివేదిక ప్రకారం... మానవ అభివృద్ధి సూచీ.. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ లో భారత్ స్థానం 132 కి పడిపోయింది. గతేడాది 131వ స్థానంలో ఉండేది. అంతకు ముందు ఏడాది 130వ స్థానంలో ఉండేది. మొత్తం 191 దేశాలకు గాను భారత్ ర్యాంక్ 132 కి చేరింది. దేశ సగటు తలసరి ఆదాయం, విద్య, ఆయుర్దాయాలను హెచ్‌డిఐ ప్రామాణికంగా తీసుకుని ఈ నివేదికను రూపొందిస్తుంది. పర్యావరణంపై ఒత్తిడిని పెంచుతున్న అంశాలను కూడా సూచిక పరిగణలోకి తీసుకుంటుంది. ఏడాదికేడాది దేశవ్యాప్తంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలలో పెరుగుదల ప్రాతిపదికన హెచ్‌డిఐ ఈ నివేదికను ప్రకటించింది.
India ranks 132 out of 191 countries in 2021 human development index, according to report released by United Nations Development Programme
— Press Trust of India (@PTI_News) September 8, 2022
పదిలో తొమ్మిది దేశాలు హ్యూమన్ డెలవప్‌మెంట్ ఇండెక్స్‌లో వెనక్కి
ఆయుర్దాయం, విద్య, ఆర్థికాభివృద్ధి అంశాల్లో దశాబ్దాలుగా సాధించిన ప్రగతి కరోనా మహమ్మారి తరువాత తిరుగుముఖం పట్టిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక సూచిస్తోంది. రెండేళ్లల్లో పదింట తొమ్మిది దేశాలు ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచికలో వెనక్కిపోయాయి. కోవిడ్ 19, యుక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. అభివృద్ధి, శ్రేయస్సుకు కొలమానం జీడీపీ మాత్రమే కాదని, అంతకుమించిన ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో 1990లో మానవ అభివృద్ధి సూచిక ను ప్రారంభించారు.బ
అగ్రస్థానంలో స్విట్జర్లాండ్.. చివరిన దక్షిణ సూడాన్
ఈ ఏడాది మానవ అభివృద్ధి సూచికలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. 84 సంవత్సరాల ఆయుర్దాయం, సగటున 16.5 సంవత్సరాల విద్య, మీడియన్ జీతం 66,000 డాలర్ల తో ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. ఈ సూచికలో చివరి స్థానంలో అంటే 191వ స్థానంలో దక్షిణ సూడాన్ ఉంది. 55 సంవత్సరాల ఆయుర్దాయం, సగటున కేవలం 5.5 సంవత్సరాల విద్య, వార్షికాదాయం 768 డాలర్లు మాత్రమే ఈ దేశానికి ఉంది. 191 దేశాలలో ఆయుర్దాయంలో గణనీయమైన తరుగుదల కనిపిస్తోంది. 30 ఏళ్ల ట్రెండ్ రివర్స్ అవుతోంది. అమెరికాలో 2019 నుంచి బిడ్డ పుట్టినప్పటి ఆయుర్దాయం రెండేళ్ల కంటే ఎక్కువ తగ్గిపోయింది.
భారత్‌లో కరోనా పరిస్థితులే కారణం !
త్వరలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాగా ఉన్న దేశంగా మారనున్న భారత్‌లో హ్యూమన్ డెలవప్‌మెంట్ ఇండెక్స్ గత రెండెళ్లుగా ఒక్కో ర్యాంక్ తగ్గిపోవడానికి కారణం కరోనానేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యధిక జనాభా ఉండటం.. లాక్ డౌన్ వంటి కారణాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వచ్చే సారి ర్యాంక్ మెరుగుపడే అవకాశం ఉంది. ర్యాంకులు తగ్గిపోయిన దేశాలన్నింటిలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.