Modi Oath Taking Ceremony: అతిథి దేవోభవ, విభేదాలు పక్కన పెట్టి మాల్దీవ్స్ అధ్యక్షుడికి భారత్ ఘన స్వాగతం!
PM Modi Swearing-in Ceremony: మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న మాల్దీవ్స్ ప్రెసిడెంట్‌కి భారత్ ఘన స్వాగతం పలకనుంది.
PM Modi Oath Taking Ceremony: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విభేదాలు పక్కన పెట్టి మరీ మాల్దీవ్స్ అధ్యక్షుడికి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మోదీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించింది. ఈ మేరకు ముయిజూ భారత్‌కి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు స్వాగతం పలుకుతూ రాష్ట్రపతి భవన్ వద్ద భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. గతేడాది నవంబర్‌లో అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన ముయిజూ భారత్‌తో దూరం పాటిస్తున్నారు. అటు చైనాతో సన్నిహితంగా ఉంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. అక్కడి పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేశారు. దీనిపై పలువురు మాల్దీవ్స్ మంత్రులు నోరు జారారు. మోదీపై విమర్శలు చేశారు.
సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. బైకాట్ మాల్దీవ్స్ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమమే నడిచింది. ఆ సమయంలో ముయిజూ కూడా భారత్‌కి వ్యతిరేకంగానే మాట్లాడారు. చిన్న దేశం అని తమను తక్కువ అంచనా వేయొద్దంటూ భారత్‌కి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పైగా చైనాలో పర్యటించి ఆ దేశంతో మైత్రిని పెంచుకుంటున్నట్టు చెప్పారు. అప్పటి నుంచి భారత్, మాల్దీవ్స్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మాల్దీవ్స్‌కి వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. "దయచేసి మాల్దీవ్స్‌కి రండి" అని అక్కడి పర్యాటక శాఖ ఇప్పుడు ప్రకటనలు చేయాల్సి వస్తోంది. భారత్‌లో కొద్ది రోజుల పాటు ప్రత్యేకంగా క్యాంపెయిన్ కూడా చేసేందుకు సిద్ధమైంది మాల్దీవ్స్. ఆ స్థాయిలో అక్కడి పర్యాటక రంగం దెబ్బ తింది. అటు ముయిజూ మాత్రం భారత్‌తో అదే దూరాన్ని పాటిస్తూ వస్తున్నారు. కానీ ఈ మధ్యే మళ్లీ కాస్త దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్‌తో తమకు మైత్రి అవసరమే అని వెల్లడించారు. పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. సరిగ్గా ఇదే సమయంలో భారత్‌లో ఎన్నికలు జరగడం, మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడం కీలకంగా మారింది. అంతకు ముందే ముయిజూని పలువురు సీనియర్ నేతలు మందలించారు. భారత్‌తో కయ్యం పెట్టుకోవద్దని హెచ్చరించారు.
వాణిజ్య ఒప్పందం..!
భారత్, మాల్దీవ్స్ మధ్య ఇప్పటి వరకూ ఉన్న విభేదాలు పక్కన పెట్టి కొత్తగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తద్వార నిత్యావసర సరుకుల ఎగుమతులు, దిగుమతులు సులభతరం అయ్యే అవకాశం కలగనుంది. రెండు దేశాల మధ్య విభేదాలు తగ్గుతున్నాయన్న సంకేతాలిచ్చేందుకే భారత్ మాల్దీవ్స్ అధ్యక్షుడికి ఆహ్వానం పంపిందన్న చర్చ జరుగుతోంది. ఆయనతో పాటు మొత్తం 7 గురు దేశాధినేతలు ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథులకు స్వాగతించేందుకు ఢిల్లీలో ప్రముఖ హోటల్స్‌ని సిద్ధం చేశారు. పలు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్స్‌తో అన్ని చోట్లా నిఘా పెడుతున్నారు.