Modi's Swearing-in: G20 సమ్మిట్ నాటి రోజుల్ని గుర్తు చేస్తున్న ఢిల్లీ, మోదీ ప్రమాణ స్వీకారానికి భారీ భద్రత
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
PM Modi Swearing-in: ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విదేశాధినేతలూ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిని భద్రతా బలగాలు మొహరించాయి. హైఅలెర్ట్ ప్రకటించారు. పలు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పారామిలిటరీకి చెందిన 5 దళాలు, NSG కమాండోలు సెక్యూరిటీ అందించున్నాయి. వీటితో పాటు అణువణువునా నిఘా పెట్టేందుకు డ్రోన్‌లను రంగంలోకి దించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనున్నందున ఆ పరిసరాల్లో స్నైపర్స్‌నీ ఏర్పాటు చేయనున్నారు. South Asian Association for Regional Cooperation (SAARC) దేశాల తరపున పలువురు ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. గతేడాది G20 సమావేశాలకు ఎలాంటి భద్రత అయితే ఏర్పాటు చేశారో..అదే స్థాయిలో ఇప్పుడూ సెక్యూరిటీ ఇవ్వనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథులు హోటల్ నుంచి వేదిక వరకూ ఎలా రావాలో ముందే ఓ రూట్ మ్యాప్ ఇస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఓ నోటీస్ విడుదల చేశారు. ఆ రోజున డ్రోన్‌లు కానీ, పారా మోటార్స్, పారా గ్లైడర్స్ కానీ హాట్ ఎయిర్ బెలూన్స్ కానీ ఎగరేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.
AI టెక్నాలజీతో భద్రత..
స్నైపర్స్‌తో పాటు సాయుధ బలగాలతో గస్తీ కాయనున్నారు. ఢిల్లీవ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్‌లను ఎగరేస్తూ నిఘా పెట్టనున్నారు. బంగ్లాదేశ్ ప్రధానితో పాటు భూటాన్, నేపాల్, మారిషస్, మాల్దీవ్స్ దేశాధినేతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. వీళ్లంతా లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, ఒబెరాయ్ హోటల్స్‌లో బస చేయనున్నారు. ఇక్కడా భద్రతను పెంచారు. AI టెక్నాలజీని వినియోగించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపుల వివరాలనూ పోలీసులు వెల్లడించారు.
ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరయ్యే అతిథులు వీళ్లే..
జూన్ 9 వ తేదీన సాయంత్రం 7.15 నిముషాలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తరవాత పలువురు మంత్రులూ ప్రమాణ స్వీకారం చేస్తారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారని ఓ జాబితా విడుదల చేసింది. వీళ్లలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, మారిషస్ దేశాధినేతలు ఉన్నారు. సౌత్ ఏషియా దేశాలపైనే మోదీ ఫోకస్ పెట్టడం, ఆ దేశాధినేతల్నే ఆహ్వానించడం కీలకంగా మారింది. గ్లోబల్ సౌత్ నినాదానికి బలం చేకూర్చింది.
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా
నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ
భూటాన్ ప్రధాన మంత్రి త్సెరింగ్ తోబ్గే
మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్
మాల్దీవ్సీ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ
సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫిప్