ప్రధాని మోదీ రిక్వెస్ట్ చేస్తేనే జిన్‌పింగ్ కలిశారు, చైనా ప్రకటన - భారత్ అసహనం
Modi Jinping Meet: ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Modi Jinping Meet:
సరిహద్దు వివాదం..
భారత్, చైనా మధ్య దాదాపు రెండేళ్లుగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంటోంది భారత సైన్యం. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit)లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అయితే...ఈ సమావేశంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే చైనా అధ్యక్షుడు మోదీతో భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్రం గట్టిగా స్పందించింది. చైనా కోరింది కాబట్టే ప్రధాని, చైనా అధ్యక్షుడితో సమావేశమయ్యారని చెబుతోంది. చాలా రోజులుగా చైనా ఈ భేటీ కోసం ఎదురు చూస్తోందని, అందుకే మోదీ సౌతాఫ్రికాలో షెడ్యూల్ చేశారని వివరిస్తోంది. జొహన్నస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఇద్దరు నేతలు అత్యంత రహస్యంగా మాట్లాడుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
"మా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్ విజ్ఞప్తి మేరకు ఈ సమావేశం జరిగింది."
- చైనా విదేశాంగ శాఖ
కీలక భేటీ..
ఈ భేటీలో ఇద్దరు నేతలూ సరిహద్దు వద్ద ఉద్రిక్తతల్ని తగ్గించడంపై చర్చించారని తెలుస్తోంది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఈ వివాదం ముదిరింది. దాదాపు 19 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ ఇంకా ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరలేదు. ఇలాంటి కీలక తరుణంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ అవ్వడం చర్చకు దారి తీసింది.
"బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ఇక్కడికి వచ్చారు. అదే సమయంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఇతర బ్రిక్స్ దేశాల నేతలతోనూ ప్రధాని సమావేశమయ్యారు. చైనా విషయానికొస్తే..LAC వద్ద ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి చెక్ పెట్టాలని ప్రధాని మోదీ జిన్‌పింగ్‌తో చెప్పారు"
- వినయ్ ఖ్వాత్రా, భారత విదేశాంగ శాఖ సెక్రటరీ
ఈ భేటీపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. శాంతియుత వాతావరణం నెలకొనాలంటే రెండు వైపులా ప్రయత్నాలు జరగాలని తేల్చిచెప్పారు.
"చైనా భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవ్వాలంటే సరిహద్దు ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. రెండు దేశాల ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలి. ప్రపంచ అభివృద్ధికీ రెండు దేశాలు తోడ్పడాలి"
-జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు