గల్వాన్ ఘటనే చివరిది కాదు, ఆ తరవాత రెండు సార్లు ఘర్షణలు - రిపోర్ట్ సంచలనం
India China Tensions: గల్వాన్ ఘటన తరవాత భారత్, చైనా సైనికుల మధ్య రెండు సార్లు ఘర్షణలు జరిగినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది.
India China LAC Tensions:
రెండు సార్లు ఘర్షణ..?
మూడేళ్ల క్రితం గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరవాతే రెండు దేశాల మధ్య వైరం పెరుగుతూ వచ్చింది. భారీ ఎత్తున సరిహద్దు వద్ద సైనికులను మొహరించడం, యుద్ధ ట్యాంకులను తరలించడం ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. అయితే...గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణే చివరిది కాదని, ఆ తరవాత కూడా ఇరు దేశాల సైనికుల మధ్య రెండు సార్లు గొడవలు జరిగాయని ఓ నివేదిక సంచలన విషయం వెలుగులోకి తీసుకొచ్చింది. తూర్పు లద్దాఖ్‌లో 2021లో సెప్టెంబర్‌లో ఒకసారి, ఆ తరవాత 2022లో నవంబర్‌లో మరోసారి ఘర్షణ జరిగినట్టు వెల్లడించింది. కాకపోతే...అవి బయటి ప్రపంచానికి తెలియలేదని స్పష్టం చేసింది. ఈ గొవడల్లో కొందరు చైనా సైనికులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. అంతే కాదు. కొంత మంది భారత సైనికులు కోవర్ట్ ఆపరేషన్ కూడా చేసినట్టు తెలిసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన ఇద్దరు కమాండోలు నిర్వహించిన అవార్డుల ఫంక్షన్‌లో కొంత మంది సైనికులకు అవార్డులు అందజేశారు. చైనా సైనికులతో వీరోచితంగా పోరాడిన సైనికుల సేవల్ని గుర్తు చేసుకున్నారు. వాళ్లను కీర్తించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన Western Command అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో అప్‌లోడ్ చేసింది. ఆ తరవాత వెంటనే డిలీట్ చేసింది. కొంత మంది సైనికులను పొగుడుతూ వాళ్లు చైనా సైనికులతో ఎప్పుడెప్పుడు ఎలా పోరాడారో చెప్పారు. ఆ సమయంలోనే 2021,2022 ఘటనల్ని ప్రస్తావించారు. అప్పుడే తెలిసింది...ఇరు దేశాల సైనికులకు రెండు సార్లు ఘర్షణ జరిగిందని. అయితే...దీనిపై ఆర్మీ అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై స్పందించనూ లేదు.
18 రౌండ్‌ల చర్చలు..
2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి రెండు దేశాలూ సరిహద్దు వద్ద అప్రమత్తమయ్యాయి. చైనా పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే భారత్ గట్టి బదులు చెబుతోంది. ఈ ఘర్షణ వాతావరణం కొనసాగుతుండగానే అటు చర్చలూ జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 18 రౌండ్‌ల సమావేశాలు జరిగాయి. ఫలితంగా కొంత వరకూ ఉద్రిక్తతలు తగ్గినట్టే కనిపించాయి. కానీ...చైనా ఎప్పుడు ఎలా కవ్విస్తుందో తెలియదు. అందుకే...భారత సైన్యం నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు. ఓసారి సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించారు కూడా. 2022లో డిసెంబర్ 9వ తేదీన చైనా సైనికులు తవాంగ్ సెక్టార్‌లో భారత సైనికులతో గొడవకు దిగారు. అప్పటి వరకూ అక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భారత సైనికులు సరైన సమయానికి స్పందించారు కనుకనే వాళ్ల ఆగడాలను అడ్డుకోగలిగారని కేంద్రం స్పష్టం చేసింది. ఆ సమయంలోనూ రెండు వైపులా సైనికులు గాయపడ్డారు. G20 సదస్సు ముగిసిన సమయంలో భారత్ చైనాకి పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది. లద్దాఖ్‌లోని న్యోమా వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కంబాయ్ ఎయిర్‌ఫీల్డ్‌ని (Nyoma Combat Airfield) నిర్మించనున్నట్టు ప్రకటించింది. LAC వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న ఇలాంటి కీలక తరుణంలో భారత్ ఈ ప్రకటన చేయడం చైనాకు సవాలు విసరనుంది.