Indo-China Border Standoff: తవాంగ్ ఘర్షణ తర్వాత తొలి భేటీ- చైనాతో భారత్ చర్చలు సఫలమా?
Indo-China Border Standoff: భారత్- చైనా మధ్య నెలకొన్న తాజా సరిహద్దు ఘర్షణపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి.
Indo-China Border Standoff: అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత తొలిసారి భారత్- చైనా మధ్య చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో 30 నెలల సరిహద్దు ప్రతిష్టంభన నడుమ భారత్- చైనా మధ్య డిసెంబర్ 20న 17వ రౌండ్ కార్ప్ కమాండర్ల సమావేశం జరిగింది. దీని తర్వాత గురువారం ఇరుదేశాల మధ్య తవాంగ్ ఘర్షణపై చర్చ జరిగింది.
ఇరు దేశాధినేతల మార్గదర్శకత్వం ఆధారంగా భారత్- చైనా మధ్య స్పష్టమైన, లోతైన చర్చలు జరిగాయాని విదేశాంగ శాఖ ప్రకటించింది. పశ్చిమ సెక్టార్‌లో LACతో పాటు సంబంధిత సమస్యల పరిష్కారంపై ఇరుపక్షాలు బహిరంగ, నిర్మాణాత్మక పద్ధతిలో అభిప్రాయాలను పంచుకున్నట్లు వెల్లడించింది.
ఇదీ జరిగింది
డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి.
ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు.
"డిసెంబరు 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో PLA దళాలు చొరబడి.. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. అయితే మన సైనికులు ఎవరూ చనిపోలేదు. అలానే తీవ్రమైన గాయాలు కాలేదని నేను ఈ సభకు చెప్పాలనుకుంటున్నాను. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల చైనా సైనికులు తమ సొంత స్థానాలకు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత డిసెంబర్ 11న ఆ ప్రాంత స్థానిక కమాండర్.. చైనా స్థానిక కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి ఈ సంఘటన గురించి చర్చించారు. సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించాలని భారత్ పిలుపునిచ్చింది. "