India-China Border: ఇది మా పర్సనల్ మ్యాటర్, మీ జోక్యం అవసరం లేదు - అమెరికాకు చైనా వార్నింగ్
India-China Border: భారత్‌తో ఉన్న సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది.
India-China Border Dispute:
వెనక్కి తగ్గుతుందా..?
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం దాదాపు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే...కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది చైనా. పదేపదే భారీగా సైన్యాన్ని మొహరించి కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇటు భారత సైన్యం కూడా డ్రాగన్ వ్యూహాలను తిప్పి కొడుతోంది. దీనిపై అమెరికా కూడా పదేపదే స్పందిస్తూ...భారత్‌కు అండగా నిలిచింది. సూపర్ పవర్‌గా ఎదగాలనుకున్న
చైనా సామ్రాజ్య కాంక్షపై విమర్శలు చేస్తూ ఉంది. అయితే..దీనిపై చైనా గట్టిగా బదులిస్తోంది. ఇప్పుడు మరోసారి అగ్రరాజ్యానికి వార్నింగ్ ఇచ్చింది. భారత్‌తో తమకున్న సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పింది. అమెరికాకు చెందిన ఉన్నతాధికారులకు ఈ హెచ్చరికలు జారీ చేసింది చైనా. రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) త్వరలోనే సరిహద్దు వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇది ఇంకా పొడిగిస్తే..భారత్, అమెరికా మరింత మిత్రులవుతారని, అది తనకు చేటు చేస్తుందని భావిస్తున్నారు జిన్‌పింగ్. అందుకే...సరిహద్దులో శాంతియుత వాతావరణాన్ని తీసుకొచ్చి...ఇరు పక్షాలకూ ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని భావిస్తోంది. నిజానికి...భారత్, చైనా మధ్య ఉన్న ఈ వివాదంపై ఇటీవల పెంటగాన్ ఓ రిపోర్ట్ తయారు చేసింది. ఇందులో...2021లో చైనా ఎల్‌ఏసీ వద్ద వసతులు సమకూర్చుకునేందుకు కావాలనే భారీగా సైన్యాన్ని మొహరించిందని, ఆ సమయంలోనే కావాలనే ఉద్రిక్తతలకు పాల్పడిందని ఆరోపించింది అమెరికా. అటు భారత్, ఇటు చైనా..సరిహద్దు నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ... ఎవరూ తగ్గడం లేదు. దాదాపు 15 రౌండ్లకుపై చర్చలు జరిగినా..వాటితో ప్రయోజనం లేకుండా పోయింది.
ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తత..?
వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ప్రస్తుత పరిస్థితులపై సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల 'ది చాణక్య డైలాగ్స్' నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైనాతో సరిహద్దు సమస్యలపై కూడా ఆయన స్పందించారు.
" వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితి ఇప్పటికి నిలకడగానే ఉంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వివాదాస్పదమైన ఏడు ప్రదేశాల్లో నాలుగు చోట్ల సమస్య పరిష్కారమైంది. మిగిలిన రెండింటిపై దృష్టిపెట్టాం. కానీ, వాస్తవాధీన రేఖ వద్ద చైనా
బలగాల ఉపసంహరణ మాత్రం జరగడంలేదు. ప్రస్తుతం రెండు పక్షాల మధ్య దౌత్య, రాజకీయ, సైనిక స్థాయుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి చర్చల వల్లే మనం ఐదు చోట్ల పరిష్కారాలు కనుగొన్నాం. "
- జనరల్ మనోజ్‌పాండే, ఆర్మీ చీఫ్
వివాదాస్పద ప్రదేశాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ అంత వేగంగా జరగడం లేదని ఆర్మీ చీఫ్ అన్నారు. అయితే చర్చల వల్లే పరిష్కారం లభిస్తుందన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ఆర్మీ కమాండర్లను హుటాహుటిన పిలిచి మీటింగ్ పెట్టారు. తూర్పు లద్దాఖ్ వద్ద ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అత్యున్న స్థాయిలో అన్ని వ్యూహాలూ సిద్ధం చేసుకోవాలని సూచించారు. మిలిటరీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు రాజ్‌నాథ్ సింగ్.
దేశ భద్రతకు కట్టుబడి ఉన్న సైనికులందరికీ కితాబునిచ్చారు.
Also Read: UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!