India China Border Conflict: భారత్ - చైనా ఆర్మీ కమాండర్‌ల కీలక భేటీ, సరిహద్దు వివాదానికి ఫుల్ స్టాప్?
India China Border Conflict: భారత్, చైనా సీనియర్ కమాండర్‌ల మధ్య త్వరలోనే మరో రౌండ్ చర్చలు జరగనున్నాయి.
India China Border Conflict:
18 రౌండ్ల చర్చలు
దాదాపు రెండేళ్లుగా భారత్-చైనా సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. గల్వాన్ ఘటనతో మొదలైన ఉద్రిక్తతలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఇటీవలే తవాంగ్‌లోనూ ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. పదేపదే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఓ వైపు ఇలా ఘర్షణ పడుతూనే...భారత్‌తో చర్చలు కొనసాగిస్తోంది చైనా. ఇప్పటికే దాదాపు 18 సార్లు కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. క్రమక్రమంగా బలగాలను ఉపసంహరించుకున్నాయి భారత్, చైనా. కానీ...మధ్యలో మళ్లీ చైనా కవ్వించడం వల్ల భారత్ కూడా పెద్ద ఎత్తున సైన్యాన్ని మొహరించింది. అత్యాధునిక ఆయుధాలనూ సిద్ధం చేసుకుంది. ఎప్పుడు చైనా యుద్ధానికి దిగినా వెంటనే దీటైన బదులిచ్చేందుకు రెడీ అయిపోయింది. అయితే...యుద్ధం వరకూ పరిస్థితులు వెళ్లకుండా చర్చలతోనే వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది భారత్. అందుకే మరోసారి ఆ దేశంతో చర్చలకు సిద్ధమైంది. LAC వద్ద బలగాల ఉపసంహరణపై రెండు దేశాల మధ్య దౌత్య సమావేశం జరగనుంది. ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సరిహద్దు ఒప్పందాలకు కట్టుబడి అక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేలా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలనూ దారికి తీసుకురావాలని భావిస్తోంది. అందుకే వీలైనంత త్వరగా ఈ కీలక భేటీకి ముహూర్తం పెట్టనున్నారు.
"ఇరు దేశాలూ LAC వద్ద ఎలాంటి పరిస్థితులున్నాయో పరిశీలించాయి. వీలైనంత త్వరగా బలగాలను ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ విషయంలో బహిరంగంగానే మా డిమాండ్‌లు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ శాంతియుత వాతావరణం నెలకొంటే కానీ ద్వైపాక్షిక సంబంధాలు బలపడవు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు 19వ సారి సమావేశమవుతున్నాం. సీనియర్ కమాండర్‌లు ఇందులో పాల్గొంటారు "
- భారత విదేశాంగ శాఖ
అరుణాల్ ప్రదేశ్ విషయంలో చైనా మొండి వాదన మానడం లేదు. పైగా పేర్లు మారుస్తామంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ వివాదం ముదురుతున్న క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ భూభాగంలో అమిత్‌షా పర్యటించి నిబంధనలు ఉల్లంఘించారని మండి పడింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై ఓ నోట్ విడుదల చేసింది. ఈ మధ్యే చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లు మార్చింది. అవన్నీ చైనాలో భాగమే అని తేల్చి చెప్పింది. "జంగ్నన్ (Zangnan) మాదే" అంటూ అరుణాచల్‌కు కొత్త పేరు పెట్టింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ అమిత్‌షా పర్యటనపై అసహనం వ్యక్తం చేశారు. అమిత్‌షా ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.ఎవరూ సరిహద్దు వైపు చూసే సాహసం కూడా చేయలేరని తేల్చి చెప్పారు.
"మా సరిహద్దుపై కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేరు. గుండు సూది మందం ప్రాంతాన్ని కూడా ఆక్రమించలేరు. ఎవరైనా భారత్‌లోకి చొచ్చుకొచ్చే రోజులు పోయాయి. ఆర్మీ పగలనకా, రాత్రనకా కాపలా కాస్తోంది కాబట్టే ఇవాళ భారత దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు."
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
Also Read: KIm Isnomia: కిమ్ జోన్‌కి నిద్ర కష్టాలు,ఆల్కహాల్ లేనిదే కునుకు పట్టట్లేదట