Indian Cartoonists: ఇండియాలో ది బెస్ట్ కార్టూనిస్ట్‌లు ఎవరో తెలుసా? ఒక్కొక్కరిదీ ఒక్కో మార్క్
Famous Indian Cartoonists: శంకర్ పిళ్లై, ఆర్‌కే లక్ష్మణ్..ఇలా ఎంతో మంది కార్టూనిస్ట్‌లు తమదైన శైలిలో సమాజంలోని సమస్యలపై కార్టూన్లు వేసేవారు.
Famous Indian Cartoonists:
కార్టూన్స్‌కు విలువ పెరిగింది అందుకే..
వంద మాటలు చెప్పలేంది. ఒక్క కార్టూన్ చెబుతుంది అంటారు. కార్టూన్‌కు ఉన్న విలువ అలాంటిది. వీటిలో నవ్వు తెప్పించేవే కాదు. ఆలోచింపజేసేవీ ఉంటాయి. ప్రభుత్వాలను పొగుడుతూ కొన్ని, చురకులు అంటిస్తూ కొన్ని. నిత్యం ఇవి వార్తాపత్రికల్లో, మ్యాగజైన్స్‌లో కనిపిస్తూనే ఉంటాయి. కేవలం ఈ కార్టూన్‌ల కోసమే వార్తాపత్రికలు చదివే వాళ్లూ ఉంటారు. సమాజంలోని సమస్యలను, అన్యాయాలను, అవినీతిని, అరాచకత్వాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి. ఇలా భారత్‌లో ఎంతో మంది కార్టూనిస్ట్‌లు తమదైన శైలిలో కార్టూన్‌లు వేసి..ఆదరణ సంపాదించుకున్నారు. కార్టూన్‌లు ఎవరు చూస్తారులే అనుకున్న ఆలోచనను మార్చేసి, ఆ కళకు కూడా గుర్తింపు తెచ్చిన కార్టూనిస్ట్‌లు ఎందరో ఉన్నారు.
1. శంకర్ పిళ్లై:
భారత్‌లో పొలిటికల్ కార్టూనింగ్ ఉన్న పాపులారిటీ తక్కువేమీ కాదు. కాస్తంత హ్యూమర్ జోడిస్తూ వేసే కార్టూన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే పొలిటికల్ కార్టూనింగ్ అంటే భారత్‌లో గుర్తొచ్చే మొట్టమొదటి పేరు కేశవ శంకర్ పిళ్లై. కేరళకు చెందిన ఈయన...శంకర్ పేరుతో కార్టూన్లు వేసేవారు. ఈయనను "ఫాదర్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ కార్టూనింగ్"గా పిలుస్తారు. శంకర్స్ వీక్లీకి ఆయనే ఎడిటర్‌గా ఉండేవారు. ఆయన గీసే కార్టూన్లకు "Punch" అని పేరు పెట్టారు. ఈ కార్టూన్లు...అబు అబ్రహం, రంగ, కుట్టి లాంటి మరెందరికో స్ఫూర్తినిచ్చింది. 1976లో శంకర్‌ను పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. కార్టూనింగ్‌లోనే కాదు. సాహిత్య రంగంలోనూ ఆయన సేవలందించారు. 1986లో కన్నుమూసిన శంకర్,
వర్ధమాన కార్టూనిస్ట్‌లకు రోల్‌మోడల్‌గా నిలిచారు.
2. బాలాసాహెబ్ ఠాక్రే:
మహారాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే..కార్టూనిస్ట్ కూడా. Free Press Journalలో జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు ఠాక్రే. తరవాత కొద్ది రోజులకే సొంతగా మార్మిక్ అనే పొలిటికల్ వీక్లీని మొదలు పెట్టారు. ముంబయిలో మరాఠీయేతర జనాభా పెరుగుతుండటంపై తనదైన స్టైల్‌లో కార్టూన్లు వేసేవారు ఠాక్రే. ఇదొక్కటే కాదు. పేదరికం, ధరల పెరుగుదలతో పాటు అల్లర్లు, మత ఘర్షణలు లాంటి సమస్యలపైనా సెటైరికల్‌గా కార్టూన్లు వేసేవారు. 2012లో తుదిశ్వాస విడిచారు.
3. ఆర్‌కే లక్ష్మణ్:
"కామన్ మేన్" పేరుతో వచ్చిన కార్టూన్లు ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్టూన్లకు కూడా ఓ బ్రాండ్ క్రియేట్ అయింది వీటి వల్లే. వీటిని గీసిన వ్యక్తి ఆర్‌కే లక్ష్మణ్. Free Press Journalలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. "You Said it" అనే కామిక్ స్ట్రిప్‌తో కార్టూన్లు గీయటం ఆర్‌కే లక్ష్మణ్ ప్రత్యేకత. 1951లో కామన్ మేన్ బ్రాండ్ సృష్టించిన ఆర్కే...అప్పటి నుంచి సాధారణ పౌరుల ఆశల్ని, ఆశయాల్ని కార్టూన్లలో ప్రతిబింబించేవారు. ప్రజలు దీన్ని చాలా త్వరగానే యాక్సెప్ట్ చేశారు. ఆర్‌కే లక్ష్మణ్ ప్రతిభకు గుర్తుగా, ఇండియన్ పోస్టల్ సర్వీస్ పోస్టల్ స్టాంప్‌లు కూడా విడుదల చేసింది.
4. మారియో మిరందా:
భారత్‌లోని టాప్ కార్టూనిస్ట్‌లలో ఒకరు మారియో మిరందా. రోజువారీ జీవనశైలిని కళ్లకు కడతాయి ఆయన గీసే కార్టూన్లు. వీధులు, ఇళ్లు ఇలా కామన్ ప్లేసెస్‌ని బ్యాగ్రౌండ్‌గా తీసుకుంటారు. సౌత్ ముంబయిలో అప్పట్లో ప్రతి గోడపైనా ఆయన గీసిన కార్టూన్ల పోస్టర్లు అతికించేవారు. 1988లో పద్మశ్రీ పురస్కారం లభించింది. 2002లో పద్మభూషణ్ వచ్చింది. బెంగళూరులోని ఇండియన్ కార్టూనిస్ట్స్ అసోసియేషన్, మారియో మిరందాకు జీవనసాఫల్య పురస్కారం అందించింది.
5. ప్రాణ్ కుమార్ శర్మ:
ప్రాణ్‌గా ప్రాచుర్యం పొందిన ప్రాణ్‌కుమార్ శర్మ "చాచా చౌదరి" అనే క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి, కార్టూన్లు గీసేవారు. 1960లో కార్టూనిస్ట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారు. దిల్లీలోని మిలాప్ న్యూస్ పేపర్‌కు పని చేశారు. హిందీ మ్యాగజైన్ లాట్‌పాట్ (Lotpot) కోసం చాచా చౌదరి క్యారెక్టర్‌ని సృష్టించారు. 2001లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్..ప్రాణ్ కుమార్‌కు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించింది. 1995లో లిమ్‌కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. వీరితో పాటు విజయ్ నరైన్ సేథ్, సుధీర్ తైలంగ్, రామ్ వాయీకర్‌లు కూడా కార్టూన్స్ వేయడంలో తమదైన శైలి చూపించారు.
Also Read: Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే
Also Read: India's Famous Artists: తమ కుంచెతో స్వతంత్య్ర పోరాట స్పూర్తిని పంచిన చిత్రకారులెందరో