Independence Day 2022: ప్రపంచంలో ఎత్తైన వంతెనపై జాతీయ జెండా, అద్భుతం అంటున్న నెటిజన్లు
Independence Day 2022: చీనాబ్ నదిపై కట్టిన ఎత్తైన వంతెనపై సివిల్ ఇంజినీర్లు జాతీయ జెండాలను పట్టుకుని ఉప్పొంగిపోయారు.
Chenab railway bridge:
త్రివర్ణ పతాకం పట్టుకుని నినాదాలు..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్డ్ చీనాబ్ నదిపై సిద్ధమైంది. ఇటీవలే దీన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు సిద్ధమవుతున్న వేళలో..చీనాబ్ బ్రిడ్జ్ కూడా ఇందుకు వేదికైంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లు జాతీయ పతాకాలతో గోల్డెన్ ఆర్క్ వద్ద నిలబడి నినాదాలు చేశారు. గోల్డెన్ జాయింట్ పనులు పూర్తైన సందర్భంగా త్రివర్ణ పతాకాలు చేతిలో పట్టుకుని నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వశాఖ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్ అయిపోయింది. నెటిజన్లు తమ కామెంట్లతో ఇంజనీర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యులైన వారికి అభినందనలు తెలిపారు. దేశంలోని ప్రతి విభాగంలో ఈ స్థాయి పని తీరు కనిపించాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Our national pride 🇮🇳 flying high at world's highest Railway arch bridge, Chenab bridge, as the Golden Joint work is finished today.With this, deck of the bridge stands completed.#HarGharTiranga pic.twitter.com/NWeU8MfT7M
— Ministry of Railways (@RailMinIndia) August 13, 2022
The Golden Joint: Deck launching work of the world’s highest Railway Arch Bridge, Chenab Bridge completed. pic.twitter.com/nrGF0Mrm6R
— Ministry of Railways (@RailMinIndia) August 13, 2022
ఎంతో మంది శ్రమిస్తే పూర్తైంది..
గోల్డెన్ జాయింట్‌గా పిలుచుకునే ఈ వంతెనను నిర్మించేందుకు ఎంతో మంది సివిల్ ఇంజనీర్లు శ్రమించారు. 1315 మీటర్ల పొడవు, 359 మీటర్ల ఎత్తు ఉన్న ఈ బ్రిడ్జ్...పారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎత్తు కన్నా ఎక్కువ. 476 మీటర్లు విల్లు ఆకారంలో, ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైల్వే సెక్షన్‌లో ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ నిర్మాణానికి మొత్తం రూ.28 వేల కోట్లు ఖర్చు చేశారు. కాట్రా, బనహల్ ప్రాంతాల మధ్య ఈ బ్రిడ్జ్ కీలక మార్గం కానుంది. అంతేకాదు. ప్రపంచంలోనే నదికి రెండు వైపుల మాత్రమే సపోర్ట్ చేసుకుని.. మధ్యలో ఏ సపోర్ట్ లేకుండా ఉన్న వంతెనల్లో ఇది ఏడోది. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోజుకు 1,400 మంది శ్రమించారు. నిర్మాణం 2004 లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. అయితే...మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. 2008 నాటికే అందుబాటులోకి తీసుకురావాలని చూసినా...అది వీలుపడలేదు. మళ్లీ ఇన్నాళ్లకు నిర్మాణ పనులు వేగవంతమై...వంతెన అందుబాటులోకి వచ్చింది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినా..ఈ వంతెన చెక్కు చెదరదని చాలా ధీమాగా చెబుతున్నారు ఇంజనీర్లు. కనీసం 120 సంవత్సరాల పాటు ఇది మన్నికగా ఉంటుందని స్పష్టంచేస్తున్నారు.
భూకంపాలొచ్చినా ఏమీ కాదు..
ఈ బ్రిడ్జ్‌లో మొత్తం 17 పిల్లర్లు ఉన్నాయి. నిర్మాణం కోసం మొత్తం 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కుని వినియోగించారు. ఈ బ్రిడ్జ్‌ని విల్లు ఆకారంగా మలిచేందుకు దాదాపు 10,619 టన్నుల ఉక్కుని వినియోగించాల్సి వచ్చింది. ఇది సాధారణ ఉక్కు కాదు. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకూ తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. దీనిపై రైలు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. భూకంపాలను, బాంబు దాడులనూ తట్టుకుని నిలబడగలదు. ఈ బ్రిడ్జి పూర్తైనందున.. జమ్మూ కాశ్మీర్‌లోని లోయ ప్రాంతాలకు రవాణా మార్గం సులభం కానుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది.
Also Read: Independence Day 2022: స్వతంత్ర వేడుకలకు INS షిప్‌లు రెడీ , ఆ రెండు చోట్ల కళ్లు చెదిరే కార్యక్రమాలు