ఛాయ్ తాగి సమోసాలు తినడం తప్ప ఏమీ చేయరు - I.N.D.I.A కూటమిపై జేడీయూ ఎంపీ విమర్శలు
I.N.D.I.A Alliance Meet: I.N.D.I.A కూటమిపై జేడీయూ ఎంపీ సునీల్ కుమార్ విమర్శలు గుప్పించారు.
I.N.D.I.A Alliance Meetings:
మోదీ ఉంటే అన్నీ సాధ్యమే: ఎంపీ
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోదీ మేజిక్ మరోసారి వర్కౌట్ అయిందంటూ పార్టీ శ్రేణులు భారీగా ప్రచారం చేస్తున్నాయి. అంతే కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించి..హ్యాట్రిక్ కొడతామని ధీమాగా చెబుతున్నాయి. ఈ క్రమంలోనే జనతా దళ్ (యునైటెడ్) ఎంపీ సునీల్ కుమార్ పింటు ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార నినాదాన్నీ వెల్లడించారు. "మోదీ ఉంటే అన్నీ సాధ్యమే" (Modi hai toh mumkin hai) అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో I.N.D.I.A కూటమిపైనా విమర్శలు గుప్పించారు. ఆ కూటమి సమావేశాలు కేవలం ఛాయ్, సమోసాకే పరిమితమవుతాయని మండి పడ్డారు. సీట్ల షేరింగ్ విషయంలోనూ వాళ్లకు ఎలాంటి క్లారిటీ లేదని అసహనం వ్యక్తం చేశారు. "సీట్‌ల షేరింగ్ విషయంలో క్లారిటీ వచ్చేంత వరకూ ఛాయ్ తాగి, సమోసాలు తినడం వరకే ఆ సమావేశాలు పరిమితమవుతాయి" అని స్పష్టం చేశారు.
"మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. అక్కడి ప్రజలంతా మోదీని అంతగా విశ్వసించారు. వాళ్ల ఆలోచనలను అర్థం చేసుకోవాలి. రానున్న ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో త్వరలోనే నిర్ణయించుకుంటాం. నేను బీజేపీతోనే ఉన్నాను. ఇకపైనా బీజేపీతోనే ఉంటాను"
- సునీల్ కుమార్ పింటు, జేడీయూ ఎంపీ
బిహార్‌లో అలజడి..
బీజేపీ ఆదేశాల మేరకే తాను జేడీయూలో చేరినట్టు చెప్పారు సునీల్ కుమార్. బీజేపీ చెబితే ఎప్పుడైనా ఈ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగానే ఉన్నానని వెల్లడించారు. అంతే కాదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో RJD తరపున పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే...సునీల్ కుమార్ వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో అలజడి సృష్టించాయి.