Amit Shah On PFI Raids: PFI కార్యాలయాలపై దాడులు- NSAతో అమిత్ షా కీలక భేటీ
Amit Shah On PFI Raids: దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్‌ఐఏ దాడులు చేస్తోన్న వేళ అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు.
Amit Shah On PFI Raids: దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సహా పలువురు కీలక అధికారులతో ఆయన గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
అరెస్ట్
మొత్తం 11 రాష్ట్రాల్లోని PFI (Popular Front of India)ఆఫీసుల్లో రెయిడ్స్ చేశారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 106 మందిని అరెస్ట్ చేశారు. ఈ 106 మందిలో అత్యధికంగా కేరళకు చెందిన వారే ఉన్నారు. కేరళలో 22 మంది, మహారాష్ట్ర, కర్ణాటకలో 20 మంది, ఆంధ్రప్రదేశ్ ఐదుగురు, అసోంలో 9 మంది, దిల్లీలో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పుదుచ్చేరిలో ముగ్గురు, తమిళనాడులో 10 మంది, యూపీలో 8 మందితో పాటు రాజస్థాన్‌లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు.
మరో కీలక విషయం ఏంటంటే..దిల్లీ PFI ప్రెసిడెంట్ పర్వేజ్‌నూ అరెస్ట్ చేశారు NIA అధికారులు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. పర్వేజ్‌తో పాటు ఆయన సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. పర్వేజ్‌కు PFIతో ఎంతో కాలంగా అనుబంధం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా...అత్యంత పకడ్బందీగా భారీ సోదాలు చేపట్టాయి NIA,ED.ఇప్పటి వరకూ అరెస్ట్ అయిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న వారి ఇళ్లలో ఈ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. కొందరు ఉగ్రవాదులకు ట్రైనింగ్ క్యాంప్‌లూ నిర్వహించారు. ఇంకొందరు యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారని NIA అధికారులు చెబుతున్నారు.
యువతకు శిక్షణ పేరుతో పీఎఫ్‌ఐ చట్టవిరుద్ధ కార్యకలపాలు సాగిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు రావడంతో నేడు ఎన్‌ఐఏ, ఈడీ సంయుక్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టింది.
నోరు నొక్కేస్తున్నారు
దేశవ్యాప్తంగా ఉన్న PFI ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయని Popular Front of India ప్రకటించింది. PFI కమిటీ ఆఫీస్‌ల్లోనూ ఇవి కొనసాగుతు న్నాయని వెల్లడించింది. అయితే..ఈ సోదాల పట్ల PFI అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫాసిస్ట్ పాలన అంటూ విమర్శలు చేసింది. నోరు నొక్కేయడానికే ఇలా సోదాలు నిర్వహిస్తున్నారంటూ మండి పడింది. యాంటీ సిటిజన్‌షిప్ యాక్ట్ విషయంలో జరిగిన అల్లర్లకు PFIకి సంబంధం ఉందని NIA అనుమానిస్తోంది.