AP Chaviti Highcourt : ప్రైవేటు ప్లేసులో వినాయక మండపాలు పెట్టుకోవచ్చు.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వినాయకచవితి ఉత్సవాలను ప్రైవేటు ప్రదేశాల్లో నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. మత పరమైన వేడుకలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ వినాయక చవితి ఉత్సవాల వివాదం అనూహ్యమైన మలుపు తిరిగింది. మత పరమైన వేడుకలను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ప్రజలకు ఉందని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ప్రైవేటు స్థలాల్లో వినాయక వేడుకలు జరపుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకే సారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని సూచించింది. పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది.
Also Read : ప్రభుత్వ ఆస్తులకు వైఎస్ఆర్ సీపీ రంగులపై హైకోర్టు మళ్లీ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయవద్దని ఇళ్లలోనే వినాయక వేడుకలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటలవరూ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహాలు వద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే నిమజ్జన ఊరేగింపులు వద్దని ప్రజాజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని ప్రభుత్వం పేర్కొంది. వైద్యాధికారులు ఈ మేరకు సిఫార్సులు చేసినందున ఆమోదిస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : సీఎం జగన్ అమలు చేయలేకపోతున్న ఐదు హామీలేంటి..?
వినాయకచవితి పండుగకు సంబంధించి వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితి. గత రెండేళ్లుగా కరోనా లాక్ డౌన్ కారణంగా వినాయక చవితి పండుగ ఇళ్లలోనే చేసుకున్నారు. ఈ సారి కాస్త పరిస్థితులు బాగుండటంతో మండపాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం అనూహ్యంగా ఆంక్షలు విధించడంతో హిందూ సంస్థలతో పాటు ఇతర పార్టీలు కూడా తీవ్ర విమర్శలు ప్రారంభించాయి. నిర్వహించి తీరుతామని ఉద్యమాలు ప్రారంభించాయి.
Also Read : ఏపీలో కరెంట్ చార్జీలు ఎందుకు పెంచారు ?
ఈ తరుణంలో కొంత మంది హైకోర్టును ఆశ్రయించడంతో సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. ప్రస్తుతం హైకోర్టు తీర్పు ప్రకారం ప్రైవేటు ఓపెన్ స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్ నిబంధనల ప్రకారం పూజలు చేసుకోవచ్చు. ఆ ప్రకారం నిమజ్జనాలు చేసుకోవచ్చు. హైకోర్టు తీర్పుతో విగ్రహాల తయారీదారులకు కూడా కాస్త వెసులుబాటు లభిస్తుంది. రోడ్లపై పెట్టే మండపాలు మినహా ఇతర ప్రైవేటు స్థలాల్లో మండపాలు ఏర్పాటు జోరుగా సాగే అవకాశం ఉంది.