Breaking News Live: 111 నెంబర్ జీవోపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
తెలంగాణ ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె. తారక రామారావు నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనంలో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మొత్తం రూ. 236.63 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో వరంగల్ లో రూ. 193.03 కోట్లతో అభివృద్ధి పనులు, నర్సంపేటలో 43.60 కోట్లతో అభివృద్ధి పనులున్నాయి. టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులుగా దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్‌లు కీటీఆర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కేటీఆర్ వరంగల్ పర్యటన షెడ్యూల్..
వరంగల్, హన్మకొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న వరంగల్, మహానగరం పరిధితోపాటు, నర్సంపేట నియోజకవర్గంలోని కోట్లాది రూపాయలతో చేపట్టిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపన, అనేక కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ నర్సంపేటలో గంటపాటు గడుపుతారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ లో మధ్యాహ్నం 12.30 గంటలకు దిగనున్న కేటీఆర్ మధ్యాహ్నం 1.30 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నర్సంపేట మున్సిపాలిటీ ఆవరణలో ఒకే చోట మెప్మ పరిపాలన భవనం, లైబ్రరీకి, చెన్నరావు పేట, దుగ్గొండి మహిళా సమాఖ్య భవనాలను కేటీఆర్ ప్రారంభించనున్నారు.
అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడుతో పాటు యానాంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. నేడు సైతం తీరం వెంట 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనుడగా.. మిగతా చోట్ల మాత్రం ఎండలు మండిపోతాయి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ప్రజలు రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలని అధికారులు సూచించారు.
గత మూడు వారాల నుంచి ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాంతో వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. గత మూడు నెలలుగా నిలకడగా ఉన్న ఇంధన ధరలు ప్రస్తుతం రోజువారీగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 20th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి.
తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119 కాగా, డీజిల్‌పై లీటర్ ధర రూ.105.02 గా ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.119.19 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.20 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) భారీగా పెరిగాయి. నేడు కరీంనగర్‌లో 46 పైసలు పెరిగి, పెట్రోల్ లీటర్ ధర రూ.119.68 కాగా, 42 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.105.65కు చేరింది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 51 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.49 కాగా, డీజిల్‌పై 48 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.35కి చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో ఇంధన ధరలు తగ్గాయి. ఇక్కడ పెట్రోల్ (Petrol Price in Vijayawada 20th April 2022)పై 49 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.121.19 కాగా, ఇక్కడ డీజిల్ పై 46 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.106.80 అయింది.
విశాఖపట్నంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 23 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.
చిత్తూరులో పెట్రోల్ లీటర్ రూ.122.19 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.107.68 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
Telangana: 111 నెంబర్ జీవోపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
111 నెంబర్ జీవోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆ జీవో కారణంగా అమల్లో ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ మరో జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం. 69 నెంబర్ జీవో జారీ చేసి ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో జంట జలాశయాల పరిధిలో నిర్మాణాలకు ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవు. సుమారు 84 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది.
Kishan Reddy: రైస్ మిల్లుల్లో తనిఖీలు- FCIకి ఆదేశించినట్టు కిషన్ రెడ్డి ప్రకటన
తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బియ్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైస్‌మిల్లలపై తనిఖీలు చేయాలని ఎఫ్‌సీఐకి ఆదేశించినట్టు వెల్లడించారు. కొన్ని రైస్ మిల్లుల్లో ఉండాల్సినంత స్టాక్ ఉండటం లేదని తెలిపారు. 40 మిల్లుల్లో తనిఖీలు చేస్తే భారీగా లోటు ఉన్నట్టు వెల్లడైందని పేర్కొన్నారు. 4,53,896 బస్తాలు తక్కువ ఉన్నట్టు తేలిందన్నారు. బియ్యం ఏమయ్యాయో తేలాలన్న ఆయన అందుకే తనిఖీలకు ఆదేశించినట్టు వెల్లడించారు. రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారాయన. .
KTR Warangal Tour: వరంగల్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
KTR Warangal Tour: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.8 కోట్లతో నిర్మించిన స్మార్ట్ రోడ్లను, రూ.2 కోట్లతో నిర్మించిన కౌన్సిల్ హాల్‌ను, రంగంపేటలో రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోతననగర్ వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, తక్కళ్లపల్లి రవిందర్ రావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా పార్టీ నేతలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
టీడీపీ కార్యకర్త వాసుదేవను పరామర్శించిన పరిటాల శ్రీరామ్
శ్రీ సత్య సాయి : ధర్మవరం పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామ్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ టీడీపీ కార్యకర్త వాసుదేవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాసుదేవను విచక్షణారహితంగా కొట్టారంటూ టీడీపీ శ్రేణుల ఆందోళన చేశాయి. టీడీపీ నేతల ఆందోళనతో పోలీసులు వాసుదేవను విడిచిపెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాసుదేవను పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. తమపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.
Talasani Srinivas Yadav: గవర్నర్ తమిళిసై ప్రెస్‌మీట్లు పెట్టి నేతల్ని నిందించటం సరికాదు
Talasani Srinivas Yadav: రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రెస్‌మీట్లు పెట్టి నిందించటం సరికాదన్నారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తాము ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల చేత ఎన్నికైన నేతలమని, నామినేటెడ్ పదవిలో ఉన్న వ్యక్తులం కాదన్నారు. సీఎంతో పని చేయడం ఇష్టం లేదని గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం సరికాదని, ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే పాత్ర చాలా తక్కువ... గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అంటూ తమిళిసైకి హితవు పలికారు.