Hathras Stampede: బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
Hathras Stampede News in Telugu: బాబాలను నమ్ముకుని చాలా మంది ఏదో విధంగా నష్టపోతున్నారు. ఎన్ని ఘటనలు జరుగుతున్నా కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు.
Hathras Stampede Death: ఒక్కరాత్రిలో అద్భుతాలు జరిగిపోవాలి. ఒకేసారి కష్టాలన్నీ కంపౌండ్ వాల్ దాటి వెళ్లిపోవాలి. ఇదిగో ఈ ఆలోచనే మూఢ నమ్మకాలకు దారి తీస్తోంది. ఉన్న వాళ్లు చాలదంటూ కొత్త బాబాలను సృష్టిస్తోంది. వాళ్లు ఏం చెబితే అదే వేదం. అంత గుడ్డిగా ఎలా నమ్ముతారో అని అందరూ ఆశ్చర్యపోయేంతగా నమ్మేస్తారు కొందరు. ఎన్ని వివాదాలు వచ్చినా, ఎంత నేరచరిత్ర ఉన్నా సరే బాబాల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. తమను తాము దైవాంశ సంభూతులుగా చెప్పుకుంటూ బూతులు మాట్లాడతారు. రోగం నయం చేస్తామని చెప్పి మహిళలను ఎక్కడ పడితే అక్కడ తాకుతారు. ఇంకేదో పేరు చెప్పి చెప్పులతో కొడతారు. అయినా సరే ఇవన్నీ భరిస్తారు భక్తులు. వాళ్ల నమ్మకమే బాబాలకు పెట్టుబడిగా మారుతోంది. హత్రాస్ తరహా ఏదో ఓ దారుణం జరిగినప్పుడు మాత్రమే హడావుడి అంతా. ఆ తరవాత షరామామూలే. అధికారులూ ఆ బాబాలపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారన్న వాదనలు కొత్తేమీ కాదు. వాళ్లకున్న పొలిటికల్ బ్యాగ్రౌండ్‌తో మొత్తం వ్యవస్థనే కంట్రోల్ చేసేస్తారు కొందరు బాబాలు. ఆ స్థాయిలో ఉంటుంది వాళ్ల పలుకుబడి. ఇప్పుడు హత్రాస్ ఘటనలోనూ పోలీసులు సాకార్ విశ్వహరి భోలే బాబా (Sakar Vishwa Hari Bhole Baba) పేరు FIRలో లేనే లేదు. ఇంత విషాదానికి కారణమైన బాబా పేరే కనిపించలేదు. ఆయన అనుచరుడిపై కేసు నమోదు చేశారు. క్రిమినల్ రికార్డులున్న బాబాలు ఎంతో మంది ఉన్నారు. నిర్మల్ బాబా, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, రామ్‌పాల్ మహారాజ్, సంత్ ఆశారాం బాపూ...వీళ్లంతా ఆ కోవకు చెందిన వాళ్లే.
వీళ్లలో కొంత మందిపై అత్యాచార కేసులూ నమోదయ్యాయి. మరి కొందరిపై హత్యా కేసులున్నాయి. ఇదంతా తెలిసి కూడా వాళ్లపై కొందరు భక్తిని పెంచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు హత్రాస్ విషయానికే వస్తే ఈ ఘటనలో బాధితులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్లే. పైగా నిరక్షరాస్యులు. వీళ్లంతా పూట గడవడానికే నానా అవస్థలు పడుతుంటే అటు బాబా మాత్రం విరాళాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే...ఇలాంటి మూఢనమ్మకాలకు మూలం పేదరికం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కొన్ని సందర్భాల్లో బాగా డబ్బు ఉండి, చదువుకున్న వాళ్లు కూడా ఇలాంటి గుడ్డి నమ్మకాలు పెట్టుకుంటున్నారు. భోలే బాబా పాదధూళి కోసం అంత మంది ఎగబడ్డారంటే ఏ స్థాయిలో వాళ్లు నమ్మి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అందుకే అంత మంది ఒక్కసారిగా తరలి వచ్చారు. అయినా నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యంగానే ఉన్నారు. అదే తొక్కిసలాటకు దారి తీసి ప్రాణనష్టం కలిగించింది. ఈ కేసులో బాబాని అరెస్ట్ చేసినా పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్‌తో బయటకు వచ్చేస్తారు. అయిన వాళ్లను కోల్పోయిన కుటుంబ సభ్యులు మాత్రం జీవితాంతం బాధ పడుతూనే ఉంటారు. ఇది ఎప్పుడూ జరిగేదే. కాకపోతే..ఈ బాబాలపై నిఘా పెట్టాల్సిన అవసరముందని పదేపదే ఇలాంటి విషాదాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి.
Also Read: Hathras Stampede: హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది