Hathras Stampede: హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
Hathras Stampede News in Telugu: యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా అలజడి రేపింది. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది.
Hathras Stampede Death: యూపీలోని హత్రాస్‌లో జరిగిన ఘోర విషాదం దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. భోలే బాబా పాదధూళి కోసం వెళ్లి అంత మంది తొక్కిసలాటలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒకరిపైన ఒకరు పడిపోయి ఊపిరాడక మృతి చెందారు. అయితే..ఈ విషాదానికి నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో జనం వస్తారని తెలిసి కూడా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు నిర్వాహకులు. పోలీసుల భద్రతా లేదు. FIR ప్రకారం చూస్తే కేవలం 80 వేల మందికి మాత్రమే అక్కడికి వచ్చేందుకు అనుమతి ఉంది. కానీ...రెండున్నర లక్షల మంది సత్సంగ్‌కి వచ్చారు. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు లేవు. భోలే బాబా అక్కడి నుంచి వెళ్లి పోతుండగా ఆయన కార్ టైర్‌లకు అంటుకున్న దుమ్ముని సేకరించేందుకు ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. అదే తీవ్ర విషాదానికి దారి తీసింది. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే...ఈ దుమ్ము కోసం ముందుకి వచ్చిన జనాన్ని బాబా అనుచరులు కర్రలతో కట్టడి చేశారు. వెనక్కి నెట్టేశారు. ఆ సమయంలోనే ఒకరిపైన ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగింది.
ఎంత మంది వస్తారో ఓ అంచనా ఉన్నప్పుడు కనీసం ఆ స్థాయిలో పోలీస్ ఫోర్స్‌ని అయినా ఏర్పాటు చేయాల్సింది. కానీ అది జరగలేదు. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడ కేవలం 40 మంది పోలీసులే ఉన్నారు. లక్షలాది మందిని 40 మంది పోలీసులు ఎలా కట్టడి చేయగలరు..? అది సాధ్యమేనా..? అందుకే ఆ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. యోగి సర్కార్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకూ ఎవరినీ ఈ కేసులో అరెస్ట్ చేయలేదు. మరో కీలక విషయం ఏంటంటే...ఈ కేసులో ఎక్కడా భోలే బాబాని నిందితుడిగా చేర్చలేదు. ఆయన అనుచరుడి పేరుతోనే FIR నమోదైంది. సరిగ్గా ఎంత మంది వస్తారన్నది పోలీసులకు నిర్వాహకులు ఎలాంటి సమాచారం అందించలేదు. పైగా సాక్ష్యాధారాలను తప్పుదోవ పట్టించేందుకూ ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన Bharatiya Nyaya Sanhita కింద నిందితుడిపై పలు కేసులు నమోదు చేశారు.