Hate Crimes in Canada: ఇండియన్స్ అంతా అప్రమత్తంగా ఉండండి, విదేశాంగ శాఖ ప్రకటన
Hate Crimes in Canada: కెనడాలో భారతీయులపై విద్వేషం పెరుగుతుండటంపై అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది.
Hate Crimes in Canada:
కెనడాలోని భారతీయులకు సూచన..
కెనడాలో భారతీయులపై వివక్ష, దాడులు పెరుగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కెనడాలోని ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాంటీ ఇండియా ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో పరిస్థితులను సునిశితంగా గమనించాలని సలహా ఇచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయం వెల్లడించింది. Pro-Khalistan ఉద్యమం కెనడాలో జోరందుకుంటోంది. సిక్కులకు ప్రత్యేక ప్రాంతం కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ దేశంలో ఈ ఉద్యమానికి సంబంధించిన అలజడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఇది నడుస్తూనే ఉన్నా..ఈ మధ్య కాలంలో ఉద్ధృతమైంది. భారత్-కెనడా మధ్య ఎప్పుడు చర్చలు జరిగినా...ఈ సమస్య గురించి ప్రస్తావన వచ్చేది. "భారతీయులపై విద్వేషం పెరుగుతోంది. హింసాత్మక ఘటనలూ పెరుగుతున్నాయి" అని కెనడాలోని భారతీయులు, భారతీయ విద్యార్థులు వెల్లడించారు. "భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం" అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. వరుసగా జరుగుతున్న ఘటనలపై దృష్టి సారించి విచారణ జరపాలని కెనడాలోని భారత్ హై కమిషన్ కోరింది. ఇప్పటి వరకూ నిందితులను పట్టుకోలేదని అసహనం వ్యక్తం చేసింది.
"ఇలాంటి ఘటనలు ఏ మాత్రం సహించేవి కాదు. కచ్చితంగా వీటిని ఖండించాల్సిందే. కొన్ని రాజకీయ శక్తులు ఇలాంటి అశాంతి సృష్టిస్తున్నాయి. భారత్‌కు మైత్రి దేశమైన కెనడాలో ఇలాంటివి జరగటం బాధాకరం" అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. అయితే...దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించింది. భారత్‌ను ఎంతగానో గౌరవిస్తామని, ఇలాంటి వాటిని సహించమని చెప్పింది. కెనడాలో 16 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక భారతీయులు ఉన్న దేశాల్లో కెనడా ఒకటి. అక్కడి జనాభాలో 3% కన్నా ఎక్కువ ఇండియన్స్ ఉన్నారు. అక్కడి 17 మంది ఎంపీలు, ఇద్దరు మంత్రులు భారతీయులే.
ఈ ఘటనతో ఘర్షణలు..
కెనడాలోని BAPS స్వామినారాయణ్ మందిర్ వద్ద ఉన్న శిలాఫలకంపై గుర్తు తెలియన వ్యక్తులు "ఖలిస్థాన్ జిందాబాద్" అనే నినాదాలు రాశారు. అటు పక్కనే హిందుస్థాన్‌ను అనుమానించే విధంగా స్లోగన్స్ రాశారు. స్థానికంగా ఇది పెద్ద అలజడికి కారణమైంది. రాత్రికి రాత్రే వీటిపై ఎవరు రాశారన్న అంశంపై సరైన విచారణ జరపాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. టోర్నటోలో ఉన్న ఈ ఆలయం అక్కడ ఎంతో ప్రసిద్ధి. దీనిపై ఇండియన్ హై కమిషన్ (Indian High Commission) తీవ్రంగా స్పందించింది. ఆలయ ప్రతిష్ఠకు ఇలా మచ్చ తెచ్చిన వారెవరో కనుక్కోవాలని, నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులకు సూచించింది. దీనిపై పలువురు రాజకీయ నేతలూ స్పందించారు. బ్రాంప్టన్ (Brampton) సౌత్ ఎంపీ సోనియా సిధు ట్వీట్ చేశారు. "భిన్న సంస్కృతులు, భిన్న విశ్వాసాలున్న సమాజం మనది. ఇక్కడ సురక్షితంగా జీవించే హక్కు అందరికీ ఉంది. ఈ ఘటనకు బాధ్యులెవరో గుర్తించి కఠిన శిక్ష విధించాలి" అని పోస్ట్ చేశారు. ఓ నెటిజన్ టెంపుల్ శిలాఫలకంపై అభ్యంతరకర రాతలు రాసినట్టు ఓ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అయితే...ఈ వీడియో నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. "ఇలాంటి దుశ్చర్యలకు కెనడాలో తావు లేదు. వీలైనంత త్వరగా నిందితుల్ని పట్టుకుంటారని ఆశిద్దాం" అని ట్వీట్ చేశారు.