H3N2 Virus India: పెరుగుతున్న ఫ్లూ కేసులు, 10 రోజుల పాటు స్కూల్స్ బంద్
H3N2 Virus India: ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో పది రోజుల పాటు స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు.
H3N2 Virus India:
పుదుచ్చేరిలో
దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో స్కూల్స్‌ను మూసివేశారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ మార్చి 17 నుంచి మార్చి 26 వరకూ సెలవులు ప్రకటించారు. H1N1తో పాటు H3N2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ఏ. నమశ్శివాయం వెల్లడించారు. గత నాలుగు రోజుల్లో అక్కడ 79 ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అటు తమిళనాడులో H1N1 వ్యాప్తి చెందుతోంది. పరిసర ప్రాంతాల్లోనూ వ్యాప్తి పెరిగే ప్రమాదముందని గుర్తించిన పుదుచ్చేరి ప్రభుత్వం పిల్లలపై ప్రభావం పడకుండా వెంటనే సెలవులు ప్రకటించింది. అటు ICMR కూడా పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, జాగ్రత్తలు పాటించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కొవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకున్నామో వాటినే కొనసాగించాలని వెల్లడించింది. అయితే...ప్రస్తుతానికి పుదుచ్చేరిలో H3N2వైరస్‌ను టెస్ట్ చేసే కేంద్రాలు చాలా తక్కువగా ఉండటం కలవర పెడుతోంది. కొవిడ్‌కు, ప్రస్తుత ఫ్లూ వ్యాప్తిలో తేడా ఉన్నప్పటికీ లక్షణాలు దాదాపు అదే విధంగా ఉంటున్నాయి. అందుకే ఏది కరోనానో, ఏది ఫ్లూనో తెలుసుకోవడం కష్టమవుతోంది.
పలు చోట్ల వ్యాప్తి..
దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పంజాబ్, గుజరాత్, ఒడిశాలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రమైన అసోంలోనూ H3N2 కేసు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అసోం ఆరోగ్య విభాగం అధికారికంగా ప్రకటించింది. అప్రమత్తమైన అధికారులు బహిరంగ ప్రదేశాల్లో అందరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు. రాష్ట్రంలోని ఫ్లూ వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. Integrated Disease Surveillance Programme (IDSP)నెట్‌వర్క్‌లో భాగంగా అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. ఈ సవాలుని ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం సహా ICMR ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపింది. ప్రస్తుతానికి కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతానికి ప్రభావం తక్కువగానే ఉందని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు కేంద్రం కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. H3N2 Influenza వ్యాప్తి చెందుతోంది. సోకడమే కాదు. ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది కూడా. కర్ణాటకలో ఓ వృద్ధుడు, హరియాణాలో ఓ వ్యక్తి ఈ వైరస్ సోకి మృతి చెందారు. ఒక్కసారిగా దేశమంతా ఈ మరణాలతో ఉలిక్కి పడింది. ఇది కూడా కరోనాలాగే పీడిస్తుందా అన్న అనుమానాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ప్యాండెమిక్‌లాగే ఇది కూడా చాలా రోజుల పాటు మనల్ని వేధిస్తుందా అని కంగారు పడిపోతున్నారంతా. ఈ వైరస్ వ్యాప్తిపై అన్ని రాష్ట్రాలనూ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ICMR కూడా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అటు నిపుణులు కూడా ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తున్నారు.
Also Read: Land-For-Jobs Case: అరెస్ట్ చేయమని హామీ ఇచ్చిన సీబీఐ, విచారణకు హాజరవుతానన్న తేజస్వీ