Taraka Ratna: వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ, సోదరుడు ఎన్టీఆర్ సైతం ప్రచార బరిలోకి: తారకరత్న ఆసక్తికర వ్యాఖ్యలు
రాబోయే రోజుల్లో ఏపీలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తారకరత్న తన పొలిటికల్ కెరీర్‌పై అప్‌డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కావాల్సినప్పుడు టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటాడని తెలిపారు.
Nandamuri Tarakaratna Political Entry: రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసి దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు రామన్నగా నిలిచిన ఏకైక నేత స్వర్గీయ నందమూరి తారకరామారావు అని నటుడు నందమూరి తారకరత్న అన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మన తెలుగింటి ఆడపడుచులకు మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తూ.. అన్నా అని పిలిచినా ప్రతి ఆడపడుచుకు నేనున్నాను అంటూ మద్దతుగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. అనంతరం తాత, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తారకరత్న తన పొలిటికల్ కెరీర్‌పై అప్‌డేట్ ఇచ్చారు. అదే సమయంలో సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కావాల్సినప్పుడు టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటాడని తెలిపారు.
ఎన్టీఆర్ విగ్రహా విష్కరణలో నందమూరి తారకరత్న మాట్లాడుతూ.. 1982లో కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఆ రోజు పేద ప్రజానీకానికి అతి పెద్ద భవంతిగా మారిందన్నారు. ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాలు మన దేశాన్ని పాలించే విధానానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని తారకరత్న వ్యాఖ్యానించారు. నేడు మన దేశాన్ని పాలించేది ఎన్టీఆర్ ఆలోచన, ఎన్టీఆర్ సృజన అని చెప్పారు. దివంగత నేత ఎన్టీఆర్ కలలు కన్న ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. మన మాచర్లలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలంతా కళ్లారా చూశారు కదా అన్నారు.
మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, మళ్ళీ మన భావి తరాలవారు సంతోషంగా బతకాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రామన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడం సాధ్యమన్నారు. అందుకోసం తన అడుగు జనాల వైపు, తన చూపు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అని తన భవిష్యత్ కార్యచరణను తెలిపారు. ఆ మహానుభావుడికి మనవడిగా, మా బాలయ్య బాబుకి అబ్బాయిగా, చంద్రబాబు నాయుడు మేనల్లుడుగా, మీ అందరి బిడ్డగా మీ ఆశీర్వదాలే తనకు శ్రీరామరక్ష అన్నారు. చివరగా ఆయనకి అడ్డొస్తే సూర్యుడు, అభిమానిస్తే చంద్రుడైనా అంతా మా బాబాయ్ బాలయ్య బాబే అని తారకరత్న అన్నారు. అయన సైన్యాధ్యక్షుడైతే మనమంతా సైనికుల్లా పని చేయాలని పిలుపునిస్తూ జై బాలయ్య, జై జై బాలయ్య, జోహార్ ఎన్టీఆర్.. జై చంద్రబాబు అన్నారు. తారకరత్న మాట్లాడుతున్న సమయంలో జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు.
తారకరత్న గతానికి భిన్నంగా గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించారు. గతంలో నటుడిగా కనిపించిన తారకరత్న, ప్రస్తుతం మాస్ పొలిటికల్ లీడర్ గా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహా ఆవిష్కరణకు హాజరైన ఆయన పొలిటికల్ కెరీర్ పై అప్ డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో కచ్చితంగా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.