NTR Centenary Award: ఎన్టీఆర్ అవార్డు రావడం నా అదృష్టం: నటి జయప్రద
NTR Centenary Award: ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పుస్కారం తనకు రావడం తన అదృష్టమని సినీ నటి జయప్రద తెలిపారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా నిన్న అవార్డును అందుకున్నారు.
NTR Centenary Award: ఎన్టీఆర్ ఉత్సవాల్లో భాగంగా తనకు ఎన్టీఆర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి జయప్రద తెలిపారు. ఈ అవార్డు తనకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో చాలా సార్లు షూటింగ్, ఎన్నికల ప్రచారాల కోసం తెనాలికి వచ్చానని.. కానీ ఈసారి ఎన్టీఆర్ అవార్డు కోసం ఇక్కడికి రావడం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందన్నారు. సంవత్సరం పాటు ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో జరుపుతున్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆయన బృందానికి జయప్రద ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ గురించి ఐదు, పది నిమిషాలు మాట్లాడితే సరిపోదని అన్నారు. ఎన్టీఆర్ తో తన ప్రయాణం అభిమానిగా, హీరోయిన్ గా, రాజకీయాల్లో.. సుదీర్ఘ కాలం సాగిందని వివరించారు. ఎన్టీఆర్ తో ప్రయాణం సాగటం ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ కళాకారుడిగానే కాకుండా రాజకియ నాయకుడుగా పేద ప్రజలు, రైతులకు కావాల్సిన పథకాలు పెద్దఎత్తున అమలు చేసిన గొప్ప నాయకుడని చెప్పారు. ప్రజలు ఎన్టీఆర్ ని యన్టియోడు అని మనస్ఫూర్తిగా పిలుచుకుంటారని జయప్రద తెలిపారు.
"ఎన్టీఆర్ శతజయంతి అవార్డు నాకు రావడం, సన్మానం చేయడం.. అందులోనూ తెనాలిలో ఇదంతా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నోసార్లు తెనాలికి వచ్చాను కానీ ఈసారి రావడం మాత్రం ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది." - జయప్రద, సినీ నటి
ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల్లో నటి జయప్రదకి ఎన్టీఆర్ అవార్డు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలు సంవత్సరం పాటు చేస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలు సంవత్సరం పాటు జరపటం చాలా ఆనందంగా ఉందని సినీ దర్శకుడు కోదండ రామిరెడ్డి చెప్పారు. చాలా రోజుల తర్వాత మంచి కార్యక్రమంలో పాల్గున్నానని వివరించారు. ఎన్టీఆర్ మిగతా కార్యక్రమాలు మంచిగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
అందంతో పాటు అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమనే కాకుండా భారతీయ చిత్ర సీమలో తన నటనతో చెరగని ముద్ర వేశారు జయప్రద. భూమి కోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి మెప్పించారు. నటిగా జయప్రద 300 పైగా సినిమాల్లో నటించారు. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా జయప్రద రాణించారు. తెలుగులో అగ్ర తారగా వెలుగొందిన జయప్రద.. మరో అరుదైన పురస్కారం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పుస్కారానికి ఆమె ఆదివారం రోజున ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఈ అవార్డును అందుకున్నారు.
ఈరోజు ‘అడవి రాముడు’ సినిమా ప్రదర్శన..
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలి పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ చలన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇవాళ ‘అడవి రాముడు’ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనకు జయప్రద, నందమూరి రామకృష్ణ, ఎ.కోదండరామిరెడ్డి హాజరై ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.