గుజరాత్ ఎమ్మెల్యేలకు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్, కొందరిపై అత్యాచార కేసులు కూడా - రిపోర్ట్
Gujarat New MLAs: గుజరాత్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 40 మందిపై క్రిమినల్ కేసులున్నట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది.
Gujarat New MLAs:
ఏడీఎఫ్ రిపోర్ట్‌లో..
గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం సాధించింది. భూపేంద్ర పటేల్ మరోసారి సీఎం బాధ్యతలు తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఆయనతో పాటు కేబినెట్‌లోని 16 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే...ఇటీవల అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADF) సంస్థ కొత్త రిపోర్ట్ విడుదల చేసింది. అందులో ఎన్నో సంచలన నిజాలు వెలువరించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తేల్చి చెప్పింది. ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రిపోర్ట్‌లో ఏముంది..?
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 22% అంటే...40 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. 2017 ఎన్నికలతో పోల్చుకుంటే ఇది కాస్త తక్కువే. అప్పట్లో గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 40 మంది ఎమ్మెల్యేల్లో 29 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయని రిపోర్ట్ వెల్లడించింది. కొందరు నాన్ బెయిలబుల్ నేరాలకు పాల్పడగా..మరికొందరు 5 ఏళ్ల జైలు శిక్షకు అర్హమైన నేరాలకూ పాల్పడినట్టు తెలిపింది. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం, హత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు లాంటివీ ఉన్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలపై
హత్యాయత్న కేసు కూడా నమోదైంది. మరో ఎమ్మెల్యేపై అత్యాచార కేసు నమోదైంది. మొత్తం 156 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 9 మంది కూడా తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు చెప్పారు. 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 4గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమపై సీరియస్ క్రిమినల్ కేసులున్నట్టు ప్రకటించారు. 2017తో పోల్చితే...ఈసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో కరోడ్‌పతీలు ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం 182 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది కోటీశ్వరలేనని ఏడీఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. బీజేపీ, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 80% మంది కోటీశ్వరులే.
భారీ మెజార్టీ..
ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాలను భాజపా గెలుచుకుంది. ఈ అఖండ విజయంతో గుజరాత్‌లో భాజపా తన జైత్రయాత్రను కొనసాగించింది. రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 17 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదు స్థానాలను గెలుచుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 30 ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. అక్కడక్కడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ...దాన్ని కూడా అధిగమించి భారీ విజయం దిశగా దూసుకుపోయింది. మోడీ, షా ద్వయం ఈ సారి కూడా మేజిక్ చేశారని బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, నీటి కొరత, జాతీయవాదంతో పాటు గుజరాతీ ఐడెంటిటీ అంశాలు... ఈసారి ఎన్నికలను ప్రభావితం చేశాయి. గత ఎన్నికల్లో బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా ఉన్న హస్తంపార్టీ ఈసారి కనిపించకుండా పోయింది. ఆప్, ఎంఐఎం పార్టీల ప్రభావం బీజేపీ కన్నా కాంగ్రెస్ కే తీవ్ర నష్టం కలిగించింది. దీనికి తోడు కాంగ్రెస్ పెద్దలు కూడా గుజరాత్
ఎన్నికలపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో ఈసారి ప్రతిపక్షహోదాని కూడా నిలుపుకోలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: Nitish Kumar:నితీష్ కుమార్ ఆన్ ఫైర్, అసెంబ్లీలో బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం