Gujarat Exit Poll 2022: ఎగ్జిట్ పోల్స్ అబద్ధం అని నిరూపిస్తాం, 100 సీట్లు సాధిస్తాం - గుజరాత్ ఫలితాలపై కేజ్రీవాల్
Gujarat Exit Poll 2022: గుజరాత్ ఎగ్జిట్ పోల్స్‌పై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
Gujarat Exit Poll 2022:
వేచి చూడండి: కేజ్రీవాల్
గుజరాత్ ఎన్నికల తంతు ముగిసిపోయింది. ఫలితాలు రేపు (డిసెంబర్ 8) విడుదల కానున్నాయి. ఇప్పటికే..ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదలయ్యాయి. అన్ని పోల్స్ కూడా భాజపాకే మళ్లీ అధికారం దక్కుతుందని స్పష్టం చేశాయి. సీట్ల విషయంలో కాస్త అటు ఇటు తేడా ఉన్నా...బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని చెబుతున్నాయి. బీజేపీ వర్సెస్ ఆప్‌లా సాగిన ఈ ఎన్నికల యుద్ధంలో ఆప్ వెనకబడిపోయిందని
ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చూస్తే అర్థమవుతోంది. అయితే...ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే...కాంగ్రెస్ ఆప్ కన్నా వెనకబడిపోయింది. అంటే...బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అని వాదించుకోడానికైనా...కేజ్రీవాల్‌కు ఓ కారణం దొరుకుతుండొచ్చు. కాంగ్రెస్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి...ఇకపై గుజరాత్‌లో ప్రతిపక్ష హోదాలో ఉండేది ఆప్ మాత్రమే అనే సంకేతాలిచ్చే అవకాశమూ లేకపోలేదు. ఇదే జరిగితే... కాంగ్రెస్ అది భారీ నష్టమే. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపడుతున్నా...గుజరాత్ ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిందన్నది ఎగ్జిట్ పోల్స్ లెక్కల్లో తేలిన విషయం. పూర్తిగా వీటిని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ తక్కువ అంచనా వేయటం అని కాదు కానీ...ఈ అంచనాలు గతంలో చాలా సార్లు నిజమవడం వల్ల అలా అనుకోక తప్పడం లేదు. అయితే...ఈ ఎగ్జిట్ పోల్స్‌ను కేజ్రీవాల్ ఒప్పుకోడానికి ససేమిరా అంటున్నారు. గుజరాత్‌లో ఆప్ కనీసం 8 స్థానాలు గెలుచుకుంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ...కేజ్రీవాల్ మాత్రం అంతకు మించి వస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఫలితాలొచ్చాక...ఈ పోల్స్ అన్నీ తప్పుడు తడకలే అని ప్రజలందరికీ అర్థమవుతుందని చెబుతున్నారు. అంతే కాదు...కనీసం 100 స్థానాల్లో గెలిచి తీరతామని స్పష్టం చేస్తున్నారు. "ఈ ఫలితాలు మాకు తప్పకుండా సానుకూలంగా ఉంటాయి. బీజేపీ కంచుకోట అయిన గుజరాత్‌లో 15-20% మేర మేము ఓట్లు రాబట్టుకోవడం గొప్ప విషయం. కౌంటిగ్ డే వరకూ అందరూ వేచి చూడండి" అని అన్నారు కేజ్రీవాల్.
ఢిల్లీ పార్టీగానే మిగిలిపోతుందా..?
అటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్‌నకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. 15 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈ సారి ఈ రికార్డుని చెరిపేసి..కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని కేజ్రీవాల్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతూ వచ్చారు. ఇప్పుడు కౌంటింగ్ ట్రెండ్ చూస్తుంటే కూడా అదే నిజమనిపిస్తోంది. దాదాపు అన్ని చోట్లా ఆప్ లీడ్‌లో దూసుకుపోతోంది. కానీ...గుజరాత్‌లో తక్కువ సీట్లు గెలిస్తే మాత్రం.."జాతీయ పార్టీ"గా ఎదగాలన్న ఆప్ లక్ష్యం నీరుగారిపోక తప్పదు. కేవలం ఢిల్లీ పార్టీగా మిగిలిపోకుండా...నేరుగా బీజేపీతో తలపడి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామని భావించారు కేజ్రీవాల్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ చూస్తుంటే...ఆయన ప్లాన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశమున్నా...పెద్ద ఎత్తున సీట్లు రాకపోవచ్చు. ఇలా చూస్తే...కేజ్రీవాల్ తన కలను నిజం చేసుకోడానికి వచ్చే ఎన్నికల వరకూ వేచి చూడక తప్పదేమో.
Also Read: Parliament Winter session: వాళ్ల బాధను అర్థం చేసుకోండి- సభ సజావుగా సాగనివ్వండి: మోదీ