Property Tax: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నుపై ఊరట - లాస్ట్ డేట్ ఎప్పుడంటే!
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను పై వడ్డీని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని నగరపాలక మరియు పురపాలక సంఘాలలో ఆస్తి, ఖాళీ జాగా పన్నులపై వడ్డీని మాఫీ చేసింది ఏపీ సర్కార్. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను పై వడ్డీని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని నగరపాలక, పురపాలక సంఘాలలో ఆస్తి, ఖాళీ జాగా పన్నుల విషయంలో ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలు, ఈ ఆర్థిక సంవత్సరం పన్నుపై విధించిన వడ్డీని వన్ టైమ్ మెజర్ గా మాఫీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ. ఎం. యస్. నెం. 34 ఎం. ఏ. ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 16న జారీ చేసిన ఈ ఉత్తర్వుల మేరకు ఏపీలోని అన్ని నగరపాలక మరియు పురపాలక సంఘాలలో ఆస్తి, ఖాళీ జాగా పన్నులపై ఉన్న బకాయిలపై వడ్డీని, ఈ ఆర్థిక ఏడాది సైతం విధించిన వడ్డీని మాఫీ చేశారు. అయితే, చెల్లించవలసిన పన్ను చెల్లింపుదారులు బకాయి ఉన్న మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంతో సహా ఒకేసారి మార్చి 31 తేదీ లోపు చెల్లించినట్లైతేనే ఈ వడ్డీ మినహాయింపు వర్తిస్తుందని మున్సిపల్ శాఖ జీవోలో పేర్కొంది.
ఆస్తి పన్ను చెల్లింపుదారులు, ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని వడ్డీ మినహాయింపు లబ్దిని పొందాలని అధికారులు సూచిస్తున్నారు. మీ ఆస్తి, ఖాళీ జాగా పన్ను బకాయిలని వడ్డీ లేకుండా ఒకేసారి మార్చి నెలాఖరులోగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్తితో పాటు ఖాళీ స్థలాలపై పన్ను చెల్లింపు విధానం, అంతే కాకుండా పన్నులను ఆన్-లైన్ ద్వారా (https://cdma.ap.gov.in/) నెట్-బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ / క్రెడిట్ కార్డు ల ద్వారా కానీ, UPI ద్వారా కానీ చెల్లించవచ్చునని ప్రజలకు సూచించారు.
ఈ అవకాశం మార్చి 31తో ముగుస్తుందని, కనుక బకాయిల మొత్తాన్ని ప్రజలు వెంటనే చెల్లించి, వడ్డీ మాఫీ లబ్దిని పొందాలని మున్సిపల్ శాఖా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి కోరారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించాలని కమిషనర్ అండ్ డైరక్టర్ ప్రవీణ్‌కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్తి పన్ను ద్వారా రాష్ట్ర ప్రజల నుంచి ఈ ఏడాది రూ.12,309 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. గురువారం (మార్చి 16) సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో సీఎం జగన్, ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సీఎం జగన్‌కు పార్లమెంటులో స్వాగతం పలికారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు కూడా సీఎం జగన్ వెంట ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.