G20 Summit 2023: జీ20 సదస్సుకు వచ్చే అతిథులకు అదరిపోయే ఆతిథ్యం - స్థానిక వంటకాలతో స్పెషల్ ట్రీట్
G20 Summit 2023: జీ-20 సదస్సుకు వచ్చే అతిథులకు స్థానిక వంటకాలతో స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ప్రత్యేక కార్యదర్శి ముక్తే పరదేశి తెలిపారు.
G20 Summit 2023: జీ20 సదస్సుకు వచ్చే అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు ప్రత్యేక కార్యదర్శి ముక్తేశ్ పరదేశి తెలిపారు. స్థానిక వంటకాలతో పసందుగా విందు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు చిరు ధాన్యాలతో కూడిన భారతీయ వంటకాల రుచి చూపిస్తామని చెప్పారు. అలాగే చిరు ధాన్యాల పౌడర్ తో ఫ్రూట్ సలాడ్లు, బెల్లం రాగి ఖీర్, స్పెషల్ మిల్లెట్ థాలి, మిల్లెట్ పలావ్, మిల్లెట్ ఇండ్లీ వంటి వంటకాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాజస్థానీ దాల్ బాటీ ఖుర్మా, పశ్చిమ బెంగాల్ రసగుల్లా, దక్షిణాది మసాలా దోశ బిహార్ లిట్టీ చోకాలనూ అతిథిలకు వండి వడ్డించబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే చాందినీ చౌక్ వంటకాలను కూడా తినిపిస్తామని స్పష్టం చేశారు.
అలాగే బంగారు, వెండి పాత్రల్లో భోజనం
భారత్ సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే సమ్మిట్‌కు ప్రపంచ స్థాయి నాయకులు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. అందు కోసం ఢిల్లీలోని హోటళ్లు ప్రత్యేకమైన రీతిలో VVIP లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. దేశాధినేతలు, ఇతర ప్రపంచ నాయకులకు వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం అందించనున్నారు. భారతదేశం సంస్కృతి, ప్రతిబింబించేలా వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం, ఆతిథ్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అతిథులకు విలాసవంతమైన విందు కోసం వివిధ లగ్జరీ హోటళ్లలో ఈ వస్తువులను ఏర్పాటు చేశారు. అత్యంత ఆకర్షణీయమైన, అందమైన పాత్రలను ఐకానిక్ ITC తాజ్ హోటల్‌తో సహా 11 హోటళ్లకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం క్రోకరీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భగా పాత్రల తయారీ సంస్థ యజమానులు రాజీవ్, అతని కుమారుడు మాట్లాడుతూ.. తాము మూడు తరాలుగా ఈ పాత్రలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. విదేశీ సందర్శకులకు తమ డైనింగ్ టేబుల్‌లపై భారతదేశ రుచిని అందించడమే తమ లక్ష్యం అని చెప్పారు. ఈ పాత్రలు జైపూర్, ఉదయపూర్, వారణాసి, కర్నాటకలో కళాత్మకంగా రూపొందించినట్లు చెప్పారు.
ఇవి భారతదేశంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఈ పాత్రలపై మేక్ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఇవి దేశంలోని హస్తకళకు ప్రతిరూపంగా నిలుస్తాయి. ఐరిస్ కంపెనీ ప్రకారం, జీ20 సమ్మిట్ కోసం 11 హోటళ్లకు ప్రత్యేకమైన పాత్రలను పంపుతున్నారు. ఈ పాత్రలు తయారైన తరువాత ప్రతి భాగం R&D ల్యాబ్‌లో క్షుణ్ణంగా పరీక్షించారు. హోటళ్ల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఈ పాత్రలు రూపొందించబడ్డాయి. 'మహారాజా తాలీ' తరహాలో ఉప్పు, పెప్పర్ కోసం ప్రత్యేక వెండి గిన్నెలు, అన్నీ హోటల్ మెనూ, శైలికి సరిపోయేలా 5-6 గిన్నెలను కలిగి ఉండేలా పాత్రల సెట్లు రూపొందించబడ్డాయి. ఈ పాత్రల సెట్లు భారతదేశం గొప్ప వారసత్వానికి ప్రతీకగా నిలవనున్నాయి. జాతీయ పక్షి నెమలిని కూడా కంపెనీ తన డిజైన్‌లో చేర్చింది. ఇది తరచుగా అతిథుల నుంచి ప్రశంసలను పొందుతుంది. మహారాజా తాలీతో పాటు, దక్షిణ భారతదేశానికి చెందిన డిజైన్‌లను కూడా సేకరణలో పొందుపరిచారు. వివిధ హోటళ్లు వారి ప్రత్యేకమైన మెనుల ఆధారంగా తమ పాత్రల డిజైన్‌లను రూపొందించారు. ఇలా ప్రత్యేకంగా తయారు చేయడానికి చాల సమయం పడుతుందని తయారీదారులు తెలిపారు.