(Source: ECI/ABP News/ABP Majha)
AP Telangana : గురువారం మీటింగ్ సక్సెస్ అయితే ఏపీకి కాసుల పంటే ! "త్రిసభ్య కమిటీ" చర్చలపై ఉత్కంఠ..
విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం గురువారం జరగనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య పీటముడి పడిపోయిన సమస్యలపై ఓ పరిష్కారానికి వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ( Telugu States ) మధ్య విభజన వివాదాలను పరిష్కరించేందుకు తొలి సారిగా త్రిసభ్య కమిటీ గురువారం సమావేశం కానుంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ప్రభుత్వం కమిటీ నియమించింది. ఈ కమిటీ తొలి సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా జగనుంది.
చర్చల ఎజెండాలో ఐదు అంశాలు !
రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వాటిలో అత్యంత కీలకమైన ఐదు అంశాలను తొలి సమావేశం అజెండాలో చేర్చారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ( AP State Finance Corporation ) విభజన, ఏపీ జెన్‌కోకు ( AP Genco)తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు, పన్నుల వ్యత్యాసాల తొలగింపు, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, ఏపీ, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థల రుణాల పంపిణీ వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు
అన్నీ రెండు రాష్ట్రాల మధ్య పీట ముడి పడిపోయిన సమస్యలే !
తెలంగాణ డిస్కంల ( Telangana ) నుంచి రూ.3,442 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు రావాల్సి ఉందని ఏపీ జెన్‌కో వాదిస్తోంది. ఇందు కోసం హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. కానీ ఏపీ విద్యు్త సంస్థలే తమకు రూ.12,111 కోట్లు రావాల్సి ఉందని వాదిస్తున్నాయి. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కు సంబంధించిన 250 ఎకరాల భూమిని తెలంగాణ స్వాధీనం చేసుకుంది. దీనిపై చర్చించాల్సి ఉంది. ఏపీ నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన రూ.495 కోట్ల నిధులు రావాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. హైకోర్టు, రాజ్ భవన్ వంటి ఉమ్మడి సంస్థల నిర్వహణకు ఖర్చు చేసిన రూ.315 కోట్లనూ ఏపీ ( Andhra ) ఇవ్వాల్సి ఉందని వాదిస్తోంది. నిర్మాణంలో ఉన్న భవనాల్లో వాటా, రూ.456 కోట్ల సంక్షేమ నిధి, రూ.208 కోట్ల నికర క్రెడిట్ ఫార్వర్డ్ నిధులు సైతం ఏపీ నుంచి రావాల్సి ఉందని వాదిస్తోంది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ఏ రాష్ట్రం ఎంత భరించాలో ఈ సమావేశంలో ఖరారు చేయాల్సి ఉంది.
చర్చల అజెండాలోని అంశాల తొలగింపుతో వివాదం !
9 అంశాల ఎజెండాతో సమావేశం నిర్వహించనున్నామని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ ( Central Home Ministry ) శుక్రవారం లేఖ రాసింది. అందులో ప్రత్యేకహోదా, లోటు భర్తీ వంటి అంశాలున్నాయి. హోదా, లోటు భర్తీ అనే వాటితో తెలంగాణకు ఏం సంబంధం అని చెప్పి తర్వాత కేంద్ర హోంశాఖ వాటిని తొలగించింది. గురువారం సమావేశంతోనే అద్భుతాలు జరిగిపోతాయని అధికారులు భావించడం లేదు. కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రతి నెలా సమావేశవ్వాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.