Akhilesh Yadav Interview: 'మతం పేరుతో రాజకీయం నా అభిమతం కాదు.. అభివృద్ధే ఎన్నికల అజెండా'
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఏబీపీ న్యూస్‌కు మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మొదలయ్యాక పార్టీల మధ్య విమర్శల వేడి ఎక్కువైంది. పోలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత వీలైనంత ఎక్కువ సమయం ప్రచారం చేయాలని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పలు సందేహాలకు సమాధానమిచ్చారు. భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్ర. మీ పోరాటం సీఎం యోగిపైనా లేక ప్రధాని మోదీపైనా?
అఖిలేశ్: అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి.. కేంద్రానికి కాదు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు ఈ బాబా సీఎంను ఓడించాలనుకుంటున్నారు.
ఓడిపోతామనే భయంతోనే సీనియర్ భాజపా నేతలందరూ యూపీకి క్యూ కడుతున్నారు. కానీ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒక్కో సైనికుడు.. భాజపాకు చెందిన ఆరుగురు నేతల కంటే బలమైనవాళ్లు.
ప్ర. 2017 అసెంబ్లీ ఎన్నికలను అఖిలేశ్ ఎందుకు ఓడిపోయారు?
అఖిలేశ్: మేం చేసిన అభివృద్ధే ప్రధాన అజెండాగా 2017 ఎన్నికలకు వెళ్లాం. భాజపా చేసిన అభివృద్ధి ఏం లేదు కనుక వాళ్లు మతం పేరుతో ప్రజలను మోసం చేశారు.
కానీ ఈసారి అభివృద్ధిపై మాట్లాడే మేం భాజపాను ఓడిస్తాం. మేం అధికారంలోకి వస్తే 300 యూనిట్ల కరెంట్‌ను ప్రజలకు ఉచితంగా అందిస్తాం.
ప్ర. కొవిడ్ పరిస్థితులను భాజపా ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది?
అఖిలేశ్: కొవిడ్ సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం బయటపడింది. ప్రజలకు అవసరమైన సమయంలో మందులు, ఆక్సిజన్ ప్రభుత్వం అందించలేకపోయింది. ప్రజలకు శ్మశానాలు మాత్రమే దిక్కయ్యాయి. ప్రజలు ఇప్పటికే భాజపా ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేశారు. ఇప్పుడు వాళ్లు ఎన్ని చెప్పినా వృథా.
ప్ర. అఖిలేశ్ యాదవ్.. అయోధ్యలో పర్యటిస్తారా?
అఖిలేశ్: ఏదో షో చేయాలని నేను దేవుడికి పూజ చేయను. అయోధ్యలో ఆలయం నిర్మితమైన తర్వాతే నేను అక్కడికి వెళ్తాను. విరాళాలు కూడా ఇస్తాను. కానీ నేను ఏం చేస్తే భాజపాకు ఏంటి?
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల బలోపేతం, అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం ఇవన్నీ మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొదలయ్యాయి. అంతేకాదు పర్యటక రంగాన్ని కూడా మేం అభివృద్ధి చేశాం.
Also Read: Pakistan Boat in India: ప్రధాని పంజాబ్ సభకు సమీపంలో చిక్కిన పాకిస్థాన్ పడవ!
Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి