Emergency Alert Message: మీ ఫోన్ కూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా, అయితే భయపడాల్సిన పని లేదు!
Emergency Alert Severe on Phone ఈరోజు చాలా మంది మొబైల్ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. అయితే అది చూసి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని పంపింది కేంద్ర ప్రభుత్వమే.
Emergency Alert Message: దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రజల మొబైల్ ఫోన్ యూజర్లకు గురువారం రోజు మధ్యాహ్నం ఓ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. తీవ్ర పరిస్థితి అన్న అర్థంలో ఆ ఫ్లాష్ మెసేజ్ ఉంది. అయితే ఇది ఎందుకు వచ్చింది, ఫోన్ కు ఏదైనా సమస్యేమో అనుకొని చాలా మంది భయపడిపోతున్నారు. అది ఎక్కడి నుంచి, ఎందుకు వచ్చిందో తెలియక వారంతా తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అయితే ఇందుకు కంగారు పాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపడం గమనార్హం. అయితే ఈ ఫ్లాష్ మెసేజ్ వచ్చిందని భయపడకండి. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగానే అందరికీ ఈ మెసేజ్ వస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల ప్రజలు ఈ మెసేజ్ లు రాగా.. తాజాగా మరోసారి ఈ సందేశం వస్తోంది. గతంలో అంటే జులై 20వ తేదీన, ఆగస్టు 17వ తేదీన కూడా పలువురు యూజర్లకు ఈ మెసేజ్ వ్చచింది.
హిందీ, ఇంగ్లీష్ తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ సందేశం
అయితే భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం... ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థను రూపొందించింది. ఈక్రమంలోనే దీన్ని ఓసారి పరీక్షించగా.. గురువారం ఉదయం 11.41 గంటల ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొంత మందికి ఈ మెసేజ్ వచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ అలర్ట్ ను పంపించారు. కేవలం మెసేజ్ యే కాకుండా ఆడియో కూడా వచ్చింది.
ఎమర్జెన్సీ అలర్ట్ సర్వర్ పేరుతో వచ్చిన మెసేజ్ లో ఏముందంటే?
ఎమర్జెన్సీ అలర్ట్ సర్వర్ పేరుతో వచ్చి మెసేజ్ లో టెలికమ్యూనికేషన్ విభాగానికి చెందిన సెల్ బ్రాడ్ కాస్టింగ్ పంపించిన నమూనా టెస్టింగ్ మెసేజ్ ఇది అని తెలిపారు. అలాగే దీన్ని పట్టించుకోవద్దని, జాతీయ విపత్త నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ను పరీక్షించేందుకు ఈ సందేశాన్ని పంపించామని చెప్పుకొచ్చారు. అలాగే విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రజా భద్రతను మరింత మెరుగు పరుస్తుందన్నారు. అలాగే ఈ మెసేజ్ కింద ఉన్న OK ఆప్షన్ ను నొక్కితే మరో మెసేజ్ కనిపించింది. అందులో మీకు వైర్ లెస్ ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చిందని.. భవిష్యత్తులోనూ ఇలాంటి ఎమర్జెన్సీ మెసేజ్ లను పొందేందుకు మీ ఆపష్షన్ ను ఎంచుకోండి అని రాసి ఉంది. అలాగే మన ఫోన్ సెట్టింగ్స్ లోనూ వైర్ లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనే ఆప్షన్ చేరింది. తమ ఫోన్లకు వచ్చిన ఈ ఫ్లాష్ మెసేజ్ ను కొంత మంది నెటిజెన్లు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అయితే మొబైల్ ఆపరేటర్లు, సెల్ బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థల అత్యవసర ప్రసార సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ పరీక్షలు చేస్తున్నట్లు టెలీ కమ్యూనికేషన్ శాఖ వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో దశల వారీగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతోంది.