Kerala Tragedy: వయనాడ్ విలయంలో ఆసక్తికర ఘటన, ప్రాణాలు కాపాడిన గజరాజు - రాత్రంతా బాధితులకు అండగా కాపలా
Wayanad: వయనాడ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళ, చిన్నారిని ఓ ఏనుగు కాపాడింది. రాత్రంతా వాళ్లకు కాపలాగా ఉంటూ ఏమీ కాకుండా చూసుకుంది.
Wayanad Landslides: వయనాడ్‌లో బాధితుల కథలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. చావు అంచు వరకూ వెళ్లి అదృష్టవశాత్తూ తప్పించుకుని వచ్చిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. బతికి బయట పడ్డాక వాళ్లు పడ్డ నరక యాతన గురించి చెబుతుంటే మనసు కదిలిపోతోంది. ఈ క్రమంలోనే ఓ మహిళ ఈ విపత్తు నుంచి ఎలా తప్పించుకుని బయటపడిందో చెప్పింది. తన మనవరాలితో కలిసి రాత్రంతా వణికిపోతూ ఉండిపోయిన ఆమె అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కించుకుంది. ఆమె ఇలా బతికి బట్టకట్టడానికి ఓ ఏనుగు సాయం చేసిందట. ముందు రోజు రాత్రి ఏం జరిగిందో ఆమె వివరిస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు.
ఏం జరిగిందంటే..
జులై 30వ తేదీన సుజాత ఇంట్లో నిద్రపోతోంది. ఉన్నట్టుండి ఆ సమయంలో భారీ శబ్దాలు వినిపించాయి. కళ్లు తెరిచి చూడగానే పెద్ద ఎత్తున బురద తన ఇంటిని ముంచేస్తున్నట్టు అర్థమైంది. నిముషాల్లోనే పైకప్పు కూలిపోయింది. ఆమె పూర్తిగా బురదలో కూరుకుపోయింది. ఏదో విధంగా అక్కడి నుంచి బయటకు వచ్చిన ఆమె తన మనవరాలిని ఎత్తుకుని బయట పడింది.
"నా మనవరాలిని ఎత్తుకున్నాను. బయట పడే సమయంలో ఓ భారీ కొమ్మ ఎదురుగా వచ్చింది. ఎలాగోలా తప్పించుకుని ఈదుకుంటూ వచ్చాను. మనవరాలిని గట్టిగా పట్టుకున్నాను. కాసేపటికి అక్కడి నుంచి బయటపడ్డాం. ఇక బతికిపోయాం అనుకుంటూ ఓ కాఫీ తోటలోకి వెళ్లాను. సాయం కోసం చాలా ఎదురు చూశాను. సరిగ్గా అదే సమయంలో మూడు భారీ ఏనుగులు నా ముందుకు వచ్చి నిలబడ్డాయి. అప్పటి వరకూ కాస్త ఊపిరి పీల్చుకున్న నాకు మళ్లీ భయం మొదలైంది. ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోయాను. దయచేసి ఏమీ చేయొద్దని ఆ ఏనుగులను వేడుకున్నాను. కన్నీళ్లు పెట్టుకున్నాను. మెల్లగా ఓ చెట్టు కింద తలదాచుకున్నాను. మా ఇద్దరికీ ఏమీ కాకుండా ఓ ఏనుగు వచ్చి మాకు అండగా నిలబడింది. తెల్లవారుజామున రెస్క్యూ టీమ్ వచ్చి మమ్మల్ని కాపాడే వరకూ అలాగే మమ్మల్ని రక్షించింది"
- బాధితురాలు
ఇదంతా వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదా. సాధారణంగా ఏదైనా తోటలోకి వెళ్లాయంటే ఏనుగులు ధ్వంసం చేసేస్తాయి. గట్టిగా ఘీంకరిస్తాయి. కానీ అదేమీ చేయకుండా ఆ మహిళని, చిన్నారికి అండగా నిలబడడం నిజంగా అద్భుతమే. అందుకే ఆ ఏనుగుని తలుచుకుని భావోద్వేగానికి గురవుతోంది బాధితురాలు. ఈ విపత్తుతో చూరల్‌మల్ ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది. అక్కడే బాధితురాలు సుజాత ఇల్లు కూడా ఉంది. కూలిపోతున్న ఇంట్లో నుంచి తన మనవరాలిని తీసుకుని బయటకు వచ్చింది. ఆ సమయంలో ఏ మాత్రం ధైర్యం చేయకపోయినా ప్రాణాలు పోయేవని చెబుతోంది. ఇరుగు పొరుగున ఎవరూ సాయం చేయడానికి కూడా లేరని వివరించింది. అంతా నదిలో కొట్టుకుపోయిందని, కను చూపు మేరలో బురద తప్ప ఏమీ లేదని వెల్లడించింది. తమ ఇంటికి దగ్గర్లోనే కొడుకు, కోడలు ఉన్నారని చెప్పింది. ప్రస్తుతానికి వాళ్లంతా మెప్పడిలోని రిలీఫ్ క్యాంప్‌లో తలదాచుకున్నారని తెలిపింది.
Also Read: Kerala: ఈ ఫొటోలు చూశాక ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయకుండా ఉండలేం, వయనాడ్ హీరోలు వీళ్లే