Electoral Bonds Value: ఎలక్టోరల్ బాండ్స్‌తో బీజేపీకి భారీ విరాళాలు, ఆ తరవాత స్థానం కాంగ్రెస్‌దే
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకే అత్యధిక విరాళాలు వచ్చినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Electoral Bonds Value: ఎలక్టోరల్ బాండ్‌లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అవి రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికిప్పుడు ఆ బాండ్‌ల విక్రయాలు ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఎక్కువగా నష్టపోయేది అధికార బీజేపీయే అన్న వాదన వినిపిస్తోంది. 2016-22 మధ్య కాలంలో ఈ పార్టీకే దాదాపు 60% మేర విరాళాలు వచ్చినట్టు అంచనా. మరి కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఎలక్టోరల్ బాండ్‌లపై ఆంక్షలు విధించడం దెబ్బ కొట్టింది. అయితే...ఎన్నికల సంఘం డేటా ప్రకారం...2016-22 మధ్య కాలంలో 28,030 ఎలక్టోరల్ బాండ్‌లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ. 16,437.63 కోట్లు. ఈ బాండ్‌ల ద్వారా అత్యధికంగా లాభాలు పొందింది బీజేపీయే. ఇప్పటి వరకూ వచ్చిన విరాళాల్లో దాదాపు 60% అంటే రూ.10 వేల కోట్ల మేర బీజేపీకే వెళ్లాయి. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీకి ఎలక్టోరల్ బాండ్‌ల ద్వారా రూ. 1,547 కోట్లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.823 కోట్లు వచ్చినట్టు ఈసీ వెల్లడించింది. మొత్తం ఈ జాబితాలో 30 పార్టీలుండగా...అన్నింటితో పోల్చి చూస్తే బీజేపీకి కనీసం మూడు రెట్లు ఎక్కువగా విరాళాలు అందాయి. 2017-22 మధ్య కాలంలో కాంగ్రెస్‌తో పోల్చి చూస్తే బీజేపీకి ఐదు రెట్లు ఎక్కువగా విరాళాలు అందినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
బీజేపీ - రూ.10,122 కోట్లు
కాంగ్రెస్ - రూ. 1,547 కోట్లు
తృణమూల్ కాంగ్రెస్ - రూ. 823 కోట్లు
CPI(M)- రూ.367 కోట్లు
NCP-రూ.231 కోట్లు
BSP-రూ.85 కోట్లు
CPI- రూ.13 కోట్లు
ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ పూర్తైన సందర్బంగా ఈ తీర్పు వెలువరించింది. ఈ బాండ్స్‌ని విక్రయించకూడదని ఆదేశించింది. విరాళాలిచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని మందలించింది. ఎన్నికల కమిషన్, SBI తమతమ వెబ్‌సైట్‌లలో ఈ వివరాలు పొందుపరచాలని తేల్చి చెప్పింది ధర్మాసనం. పార్టీలకు వచ్చిన నిధులు ఎవరు ఇచ్చారో తెలియాలని వెల్లడించింది.
Supreme Court holds Electoral Bonds scheme is violative of Article 19(1)(a) and unconstitutional. Supreme Court strikes down Electoral Bonds scheme. Supreme Court says Electoral Bonds scheme has to be struck down as unconstitutional. https://t.co/T0X0RhXR1N pic.twitter.com/aMLKMM6p4M
— ANI (@ANI) February 15, 2024