అంత జీతమిచ్చి ఏ పనీ చెప్పడం లేదు, బాగా బోర్ కొడుతోంది - కంపెనీపై ఓ ఉద్యోగి పిటిషన్
Dublin Employee: తనకు కోటి రూపాయల జీతమిస్తూ ఏ పనీ చెప్పడం లేదని కంపెనీపై ఓ ఉద్యోగి పిటిషన్ వేశాడు.
Dublin Employee:
ఖాళీగా కూర్చోబెడుతున్నారు: పిటిషనర్
ఓ వ్యక్తికి చాలా పెద్ద జీతం ఉన్న ఉద్యోగం వచ్చింది. ఏడాది ఎంతో తెలుసా..? రూ. కోటి. ఇంకేముంది..ఎగిరి గంతేశాడు. ఉద్యోగంలో చేరిపోయాడు. అంత ప్యాకేజ్ ఇస్తున్నారు కదా..చేతి నిండా పని ఉంటుందనుకున్నాడు. రోజూ ఆఫీస్‌కు వెళ్తున్నాడు. వస్తున్నాడు. కానీ పని మాత్రం లేదు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. జీతం వస్తోంది కానీ..పనేం లేదు. మెల్లగా ఆ వ్యక్తిలో అసహనం మొదలైంది. ఎంత జీతం ఎక్కువిస్తే మాత్రం ఇలా ఖాళీగా కూర్చోబెడతారా..? అని ఉద్యోగం ఇచ్చిన వాళ్లపై పిటిషన్ వేశాడు. "వర్క్ ప్లేస్‌లో నాకు బోర్‌కొడుతోంది. ఏ పనీ చెప్పకుండా ఇలా ఖాళీగా కూర్చోబెట్టడం ఏంటి" అని పిటిషన్‌లో రాసుకొచ్చాడు. Irish Rail కంపెనీలో పని చేసే డెర్మాట్ అలస్టెయిర్ మిల్స్...ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. 9 ఏళ్ల క్రితం ఈ ఉద్యోగం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి క్రమంగా తనపై ఉన్న బాధ్యతలు తగ్గిస్తూ వచ్చింది కంపెనీ. "షిఫ్ట్‌లో న్యూస్ పేపర్లు చదువుకుంటున్నాను. శాండ్‌విచ్‌లు తింటున్నాను. వాకింగ్ చేస్తున్నాను. బాగా బోర్ కొడుతోంది" అని అంటున్నాడు డెర్మాట్. దీనిపై విచారణ జరిపిన కోర్టు..ఇరు పక్షాల వాదనలు వింది. "ఓ సారి నేను నా కంపెనీపై విమర్శలు చేశాను. అప్పటి నుంచి నాకు పని ఇవ్వడం మానేశారు. ఏదో చిన్న చిన్న పనులు అప్పగించి ఊరుకుంటున్నారు" అని ఉద్యోగి వివరించాడు. అటు కంపెనీ మాత్రం మరో వాదన వినిపించింది. "మేమెలాంటి శిక్ష విధించలేదు. సీనియర్ పొజిషన్‌కు ఆయన అర్హుడు కాదు అనిపించింది. 2018లో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఫెయిల్ అయ్యాడు" అని చెప్పింది. అయితే...ఆ ఉద్యోగి తరపున న్యాయవాది మాత్రం "ఇది కచ్చితంగా శిక్షే. కావాలనే పని తగ్గించేసి ఇబ్బంది పెడుతున్నారు" అని వాదిస్తున్నారు.
అగ్రిమెంట్..
2010లో ప్రమోషన్ ఇచ్చిన కంపెనీ ఆ తరవాత తనపై కక్ష గట్టి మరీ పని తగ్గించేసిందని ఆరోపిస్తున్నాడు డెర్మాట్. 2013లో ఓసారి సిక్ లీవ్ తీసుకున్నానని, అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నారని అంటున్నాడు. ఆ తరవాత కంపెనీ ప్రతినిధులతో ఓ అగ్రిమెంట్‌కు వచ్చాడు. ప్రమోషన్ ఏమీ అడగకుండా...ఒకే పొజిషన్‌లో ఉంటానని అంగీకరిస్తేనే...తిరిగి విధుల్లోకి తీసుకుంటాని కంపెనీ తేల్చి చెప్పింది. అందుకు అంగీకరించిన డెర్మాట్ విధుల్లో చేరాడు. కానీ...ఒక్కసారిగా తన బాధ్యతలన్నింటినీ తొలగించేసి ఖాళీగా కూర్చోబెడుతున్నారని అంటున్నాడు ఆ ఎంప్లాయ్.
శ్మశానంలో ఉద్యోగం..
వర్క్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడంలోనే చాలా మంది తడబడుతుంటారు. ఈ రెండింటినీ కలిపేసి ఇంకా ఒత్తిడికి గురవుతారు. ఈ స్ట్రెస్ నుంచి బయట పడేందుకు ఒక్కొక్కరూ ఒక్కో దారి వెతుక్కుంటారు. చైనాలో ఓ 22 ఏళ్ల యువతి మాత్రం చాలా వింత దారి వెతుక్కుంది. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత కోసం శ్మశాన వాటికలో ఉద్యోగం సంపాదించుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం...చైనీస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన టాన్ అనే యువతి వెస్ట్ చైనాలోని చాంగ్‌కింగ్ మున్సిపాలిటీలోని శ్మశాన వాటికలో పని చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. "శ్మశానంలో ఉద్యోగమేంటి" అని కంగుతిన్నారు. "ఇదే నా వర్క్ ప్లేస్. ఈ పని చాలా సులభంగా ప్రశాంతంగా ఉంది. ఆడుకునేందుకు కుక్కలు, పిల్లులు ఉన్నాయి. ఇంటర్నెట్ కూడా ఉంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ యువతి.
Also Read: Viral Video: వైరల్ వెడ్డింగ్- పెళ్లికి వచ్చే వారి కోసం ఏకంగా విమానం బుక్ చేశారు!