(Source: ECI/ABP News/ABP Majha)
Next Karnataka CM: కర్ణాటక నెక్ట్ సీఎం ఎవరు? రేసులో ఆ 9 మంది
కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు. ముఖ్యమంత్రి యడియూరప్పను ఆ పదవిలో నుంచి తప్పించింది భాజపా అధిష్ఠానం. అయితే.. ఇప్పటికిప్పుడు ఆయనను తప్పించడానికి దారి తీసిన పరిస్థితులేంటి? తదుపరి సీఎం ఎవరు?
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు భాజపా సీనియర్ నేత యడియూరప్ప. రాష్ట్రంలో భాజపా సర్కారు రెండేళ్లు పూర్తి చేసుకున్న రోజే సీఎం పీఠం నుంచి ఆయన వైదొలిగారు. దీంతో కర్ణాటకలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాషాయ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ నేతకు పగ్గాలు అప్పజెప్పాలని భాజపా భావిస్తున్నట్లు సమాచారం.
సీఎం రేసులో ఉన్నది వీరేనా?
యడియూరప్ప రాజీనామా తరువాత.. సీఎం రేసులో పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
- ప్రహ్లాద్ జోషీ- కేంద్ర మంత్రి
- విశ్వేశ్వర్ హెగ్డే ఖగేరీ- కర్ణాటక అసెంబ్లీ స్పీకర్
- సీఎన్. అశ్వత్ నారాయణ - కర్ణాటక డిప్యూటీ సీఎం
- బసవరాజ్ బొమ్మై- కర్ణాటక హోం మంత్రి
- ఆర్. అశోక- కర్ణాటక ఆర్థిక మంత్రి
- ఎం. మురుగేశ్ నిరాణి- కర్ణాటక మంత్రి
- సీటీ రవి- భాజపా జాతీయ జనరల్ సెక్రటరీ
- డీవీ సదానంద గౌడ- కేంద్ర మాజీ మంత్రి
- అరవింద్ బెల్లాడ్- ఎమ్మెల్యే
ఇందులో రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజు. ఈయనకు సీఎం పదవి ఇవ్వాలని యడియూరప్ప సిఫార్సు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాను ఎవరి పేరు సూచించలేదని యడ్డీ స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర గనుల శాఖ మంత్రి మురుగేశ్ నిరాణి, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. వీరంతా లింగాయత్ వర్గానికి చెందినవారే. రాష్ట్రంలో భాజపా ఓటు బ్యాంకులో లింగాయత్‌లదే అధిక వాటా. యడియూరప్ప కూడా లింగాయత్ వర్గానికి చెందినవారే. దీంతో వీరిలో ఒకరు సీఎం అయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో వినికిడి.
అయితే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర వర్గాల్లోనూ ఓటు బ్యాంకును పెంచుకోవాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా వర్గాల నుంచి బలమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. దీంతో ఈ సారి ఓబీసీ లేదా ఒక్కళిగ వర్గం నుంచి సీఎంను ఎంపిక చేసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, కర్ణాటక ఉపముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ, రాష్ట్ర చీఫ్ విప్ సునిల్‌కుమార్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై భాజపా మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.