Vhuham Movie: 'వ్యూహం' సెన్సార్ సర్టిఫికెట్ రద్దు - రామ్ గోపాల్ వర్మ క్లారిటీ
Ram Gopal Varma: ఏపీ రాజకీయాలే ప్రధానాంశంగా తీసిన 'వ్యూహం' సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేయడంతో దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదని స్పష్టత ఇచ్చారు.
RGV Response on Vyuham Movie Sensor Certificate Cancellation: 'వ్యూహం' (Vyuham) సినిమా విడుదల ఆపాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. అయితే, న్యాయస్థానం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిందనే వార్తలను ఆయన ఖండించారు. 'కొన్ని ఛానెళ్లలో వస్తున్నట్లుగా వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదు. అసలు నిజం ఏంటంటే CBFC నుంచి సర్టిఫికెట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డులు జనవరి 12 నాటికి సమర్పించాలని హైకోర్టు అడిగింది.' అని స్పష్టం చేశారు. కాగా, వ్యూహం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీడీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) హైకోర్డును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ, కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను జనవరి 11 వరకూ సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
లోకేశ్ పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం 'వ్యూహం'. ఈ సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించారని... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని కూడా ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. గురువారం ఉదయం 11:45 నుంచి సాయంత్రం వరకు కోర్టులో దీనిపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రాత్రి 11:30 నిమిషాల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
టీడీపీ వాదన ఇదే
ఆర్జీవీ తీసిన 'వ్యూహం' సినిమా పూర్తిగా సీఎం వైఎస్ జగన్‌కు అనుకూలంగా ఉందని టీడీపీ వాదిస్తోంది. ఈ విషయాన్ని ఆర్జీవీ కూడా అంగీకరించారు. వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదలను, తండ్రికి ఇచ్చిన మాటను కొడుకు ఎలా నిలబెట్టుకున్నాడు అనే కోణంలో సినిమా ఉంటుందని చెప్పారు. వైఎస్ మరణానంతరం జగన్ పడిన కష్టాలు... ఆయనపై జరిగిన కుట్రలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని వైఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు పాత్రను అభ్యంతరకరంగా చూపించారనేది.. ఆయన తనయుడు, టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపణ. సినిమా ట్రైలర్‌ను బట్టి ఇది అర్థమవుతోందని అంటున్నారు. అందుకే సినిమా విడుదల ఆపాలని, సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ అర్ధరాత్రి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది.
నిర్మాతల అభ్యంతరం
కోర్టు ఆదేశాలపై 'వ్యూహం' నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ట్రైలర్ చూసి విడుదల ఆపేయడం సరికాదని అంటున్నారు. పైగా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, సినిమాలో కోర్టులు జోక్యం చేసుకోవడం సబబు కాదని వాదిస్తున్నారు. 10 మంది సభ్యులతో కూడిన సెన్సార్ కమిటీ, తమ సినిమా చూసి చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని... వాటన్నింటికీ వివరణ ఇచ్చుకున్న తర్వాతే సర్టిఫికెట్ జారీ చేసిందని కోర్టుకు తెలిపారు వ్యూహం సినిమా నిర్మాతల తరఫు న్యాయమూర్తులు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... సినిమా రిలీజ్ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో శుక్రవారం విడుదల కావల్సిన వ్యూహం సినిమా రిలీజ్ ఆగిపోయింది.
Also Read: YSRCP Leaders on Jagan: వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి-వైసీపీలో పెరుగుతున్న అసంతృప్త స్వరాలు