Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
IT Raids Congress MP Dhiraj Sahu Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు వద్ద దొరికిన నోట్ల కట్టల్ని కొన్ని మేషీన్ల సాయంతో సిబ్బంది జాగ్రత్తగా లెక్కిస్తున్నారు.
IT Raids On Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇల్లు, కార్యాలయాలు, ఆయనకు సంబంధించిన పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టి భారీ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల కట్టల్ని కొన్ని మేషీన్ల సాయంతో సిబ్బంది జాగ్రత్తగా లెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ తేలిన మొత్తం విలువ రూ.318 కోట్లు అని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ నేటి రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉంది.
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన కార్యాలయాలు, ఆస్తులపై ఐటీ దాడులు చేసిన సొమ్మును ఇంకా లెక్కిస్తున్నారు. ఆయన లాకర్లు, దాచిన గదులతో నోట్ల కట్టలను చూసి ఐటీ అధికారులే షాకయ్యారు. ఒడిశాలోని బోలంగీర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలో కౌంటింగ్ మేషీన్లతో నగదును లెక్కిస్తున్నారు. దాదాపు 176 సంచుల్లో నోట్ల కట్టలను ఇక్కడికి తరలించి, వాటి విలువ తేల్చేందుకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. నేటి రాత్రికి సీజ్ చేసిన నగదు విలువ తేలనుందని సమాచారం.
176 నోట్ల బ్యాగులు తీసుకురాగా, అందులో 140 వరకు లెక్కించినట్లు ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. మొత్తం 50 మంది బ్యాంకు అధికారులు 25 కౌంటింగ్ మిషన్లతో సీజ్ చేసిన నగదు లెక్కిస్తున్నారని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ భగత్ బెహెరా తెలిపారు.
డిసెంబరు 6న ఐటీ దాడి ప్రారంభం..
బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు సంబంధిత వ్యక్తులపై ఐటీ శాఖ డిసెంబర్ 6న దాడులు మొదలుపెట్టింది. ఆ దాడులు ఆదివారం ఐదో రోజు కొనసాగాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన కంపెనీలు, ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు ప్రారంభించడం తెలిసిందే.
కాంగ్రెస్ నేత, ఎంపీ ధీరజ్ సాహు మద్యం అమ్మకాలతో భారీగా ఆస్తులు కూడగట్టారని ఆరోపణలున్నాయి. అయితే ఆ నగదు ఆర్జించడంపై ఆదాయపు పన్ను ఎగవేశారని, పన్నుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని భావించి ఐటీశాఖ అధికారులు ఆయన ఆస్తులపై దాడులు చేశారని పీటీఐ తెలిపింది. గతంలో సోదాల్లో 2019లో కాన్పూర్ వ్యాపారి నుంచి పెద్ద మొత్తంలో రూ.257 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అంతకుమించి ఆస్తులు బయట పడుతున్నాయి.