Denmark: డెన్మార్క్ ప్రధానిపై ఆగంతకుడి దాడి, మోదీ తీవ్ర దిగ్భ్రాంతి - త్వరగా కోలుకోవాలని ట్వీట్
Denmark PM Attacked: డెన్మార్క్ ప్రధానిపై జరిగిన దాడిని ఖండించిన పీఎం మోదీ ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
Denmark PM Assaulted: డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ (Mette Frederiksen) పై దాడి జరిగింది. కోపెన్‌హగెన్‌లో ఓ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని మరీ నుంచి వచ్చి గట్టిగా నెట్టేశాడు. ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధానికి ఏమీ కాలేదని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. మెడకు మాత్రం స్వల్పంగా గాయమైందని వివరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు. అయితే..ఈ దాడితో ఆమె తీవ్ర ఆందోళనకు లోనైనట్టు పోలీసులు తెలిపారు. ఉన్నట్టుండి ముందు నుంచి వచ్చి నెట్టడం వల్ల ఆ కుదుపుకి మెడ వద్ద స్వల్ప గాయమైనట్టు వివరించారు.
"ప్రధాని వస్తున్న సమయంలో అంతా నిలబడి ఆమెని చూస్తున్నాం. ఓ వ్యక్తి ఆమెకి ఎదురుగా వచ్చాడు. బలవంతంగా మీదకు వచ్చి ఆమెని ఢీకొట్టాడు. ఈ ధాటికి ప్రధాని కింద పడిపోయారు. గట్టిగా నెట్టేయడం వల్ల ఆమె మెడకి కాస్త గాయమైంది. ఆ తరవాత అక్కడి నుంచి నిందితుడు పారిపోవాలని చూశాడు. కానీ సెక్యూరిటీ ఆ వ్యక్తిని వెంటాడి పట్టుకుంది. అరెస్ట్ చేసింది. "
- ప్రత్యక్ష సాక్ష్యులు
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. డెన్మార్క్ ప్రధానిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
"డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్‌పై దాడి జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనను ఖండిస్తున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
Deeply concerned by the news of the attack on Mette Frederiksen, Denmark’s Prime Minister. We condemn the attack. Wishing good health to my friend. @Statsmin
— Narendra Modi (@narendramodi) June 8, 2024
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా ఈ ఘటనను ఖండించారు. ఐరోపా సమాఖ్య ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ దాడి జరగడం సంచలనమైంది. మూడు వారాల క్రితం స్లోవాకియా ప్రధాని రాబర్ట్ ఫికోపైనా ఇలానే దాడి జరిగింది.