Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని
Monkeypox: దిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇటీవలే నైజీరియా నుంచి వచ్చిన యువతికి ఈ వైరస్ సోకింది.
Monkeypox:
దిల్లీలో మరో మంకీపాక్స్ కేసు..
దేశ రాజధాని దిల్లీ..అటు కొవిడ్, ఇటు మంకీపాక్స్ మధ్యలో నలుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నాయి. టెస్టింగ్, ట్రేసింగ్‌లో అధికారులు తలమునకలయ్యారు. ఇది చాలదని ఇప్పుడు మంకీపాక్స్ వైరస్ చుట్టుముట్టింది. ఇప్పటికే నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదవ్వగా..ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ఆఫ్రికన్ యువతిలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధరించారు. ఇటీవలే నైజీరియా వెళ్లొచ్చిన యువతిని టెస్ట్ చేయగా...ఈ వైరస్ సోకినట్టు తేలింది. అంతకు ముందు 31 ఏళ్ల నైజీరియన్ మహిళకూ మంకీపాక్స్ సోకింది. ఇప్పుడు నైజీరియా నుంచి వచ్చిన యువతి వైరస్ బారిన పడింది. ప్రస్తుతానికి బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యులు ఆమెను పర్యవేక్షిస్తున్నారని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ వెల్లడించారు. మంకీపాక్స్ బాధితులకు ఈ హాస్పిటల్‌లోనే
చికిత్స కొనసాగుతోంది. "ఓ యువతి మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. మొత్తం నలుగురు మంకీపాక్స్ బాధితులు అడ్మిట్ అయ్యారు. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా దిల్లీలో 5 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ టెస్ట్ చేస్తున్నాం. ప్రత్యేక వైద్య బృందం వారిని పర్యవేక్షిస్తోంది" అని వైద్యాధికారులు తెలిపారు.
స్థానికంగానూ మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి..?
జులై 24న దిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. సరిగ్గా అదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు నమోదయ్యాయి. పరిస్థితులు గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO),వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. తరవాత కేంద్రం కూడా అప్రమత్తమైంది. స్థానికంగానూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని, హైరిస్క్ గ్రూప్‌ల వాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వైరస్ కట్టడికి ఇప్పటి వరకూ జారీ చేసిన గైడ్‌లైన్స్‌లో కొన్ని మార్పులు చేర్పులు అవసరమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పలువురు నిపుణులతో కలిసి సమావేశమైంది. ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ EMR డైరెక్టర్ ఎల్ స్వస్తిచరణ్ దీనికి అధ్యక్షత వహించారు. మంకీపాక్స్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన అధికారులతో చర్చించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రతినిధి డాక్టర్ పవన మూర్తి కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.
బ్రిటిష్ జర్నల్‌లో ఏముందంటే..?
బ్రిటిష్ జర్నల్ ఇటీవలే ఓ విషయం వెల్లడించింది. ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న మంకీపాక్స్ వైరస్ లక్షణాలకు, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ లక్షణాలకు చాలా తేడా ఉందని తేల్చి చెప్పింది. లండన్‌లో మంకీపాక్స్ సోకిన 197 మంది బాధితుల శాంపిల్స్‌ను పరిశీలించిన తరవాత ఈ విషయం తెలిపింది. వీరిలో కేవలం 25% మంది మాత్రమే మంకీపాక్స్ బాధితులతో సన్నిహితంగా ఉన్నట్టు తేలింది. కొందరిలో లక్షణాలు కనిపించకుండానే పాజిటివ్‌గా నిర్ధరణ అవుతోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, వైరస్ కట్టడి చర్యల్లో మార్పులు చేయాలని బ్రిటీష్ జర్నల్ సూచించింది. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీసెస్..మంకీపాక్స్ మేనేజ్‌మెంట్ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేసింది. జ్వరం, చెమటలు, తలనొప్పి, దద్దర్లులాంటి లక్షణాలు...మంకీపాక్స్ సోకిన 2-4 రోజుల తరవాత కనిపిస్తున్నాయి. ఈ లోగా మరి కొందరికి వైరస్ వ్యాప్తి చెందుతోంది.
Also Read: Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు
Also Read: KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !