వెలవెలబోతున్న ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్, తాళం వేసి వెళ్లిపోయారు!
Delhi MCD Election Results 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్ కార్యాలయం మూతబడి ఉంది.
Delhi MCD Election Results 2022:
ఎన్నికల ఫలితాల వేళ..వెలవెల..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికి తేలిపోనున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే...ఆప్ గెలవటం లాంఛనమే అనిపిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి వెనకబడింది. ఈ ఎన్నికలతో భారీగా నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. అసలు...ఆ పార్టీ ఊసు కూడా ఎత్తకుండానే ఎన్నికలు జరిగిపోయాయంటే..అతిశయోక్తి కాదు. ఓ వైపు ఢిల్లీ ప్రజలంతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే...కాంగ్రెస్ ఆఫీస్ మాత్రం వెలవెలబోయింది. పార్టీ ఆఫీస్‌కి తాళం వేసి ఉంది. ఒక్క కార్యకర్త కూడా ఆ చుట్టుపక్కల కనిపించడం లేదు. కనీసం...కాంగ్రెస్ సపోర్టర్స్ కూడా అక్కడ కనిపించడం లేదు. గేటుకి తాళం వేసి వెళ్లిపోయారు. ఇది చూసిన వాళ్లంతా "ఇదేం చిత్రం" అనుకుంటూ వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ నిరాశావాదానికి ఇదే సాక్ష్యం అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ...కాంగ్రెస్ పతనమవుతూ వస్తోంది. ఇప్పటికే...గుజరాత్ ఎన్నికల్లో ఆప్ కన్నా వెనకబడి ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ దాదాపు అదే పరిస్థితి ఉంది. ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉంటే...ఇటు ఎన్నికల ఫలితాలు మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా వస్తుండటం అధిష్ఠానాన్ని కలవర పెడుతోంది. ఈ మధ్యే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు తీసుకున్నారు. పార్టీని పునర్నిర్మించే పని మొదలు పెట్టారు. కానీ...ఇందుకు చాలా సమయం పట్టేలా ఉంది.
No party workers are present at the Congress party office as the counting of votes for the MCD elections is underway @INCIndia #MCDElections2022 pic.twitter.com/GahrEwg5qW
— Saurav Gupta (@saurav_7297) December 7, 2022
ఖర్గే వార్నింగ్..
మొదటి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ (Congress Steering Committee) సమావేశం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంస్థాగత జవాబుదారీతనం పై నుంచి క్షేత్ర స్థాయి వరకు ఉండాలన్నారు. తమ బాధ్యతలను నిర్వర్తించలేని వారు తప్పుకోవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో రాబోయే 30 నుంచి 90 రోజుల్లో ప్రజల సమస్యలపై ఉద్యమానికి రోడ్ మ్యాప్‌ను సమర్పించాలని ఖర్గే రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను కోరినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
" పై నుంచి కింది స్థాయి వరకు సంస్థాగత జవాబుదారీతనం అనేది పార్టీ, దేశం పట్ల మన బాధ్యతలో అతి ముఖ్యమైన భాగం అని నేను నమ్ముతాను. కాంగ్రెస్ బలంగా, జవాబుదారీగా, ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటేనే ఎన్నికల్లో గెలిచి దేశ ప్రజలకు
సేవ చేయగలం. కీలక పదవుల్లో ఉన్న కొంత మంది పార్టీలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అలా లేని వారిని పార్టీని కచ్చితంగా విస్మరించాల్సి వస్తుంది. "
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు