సీఎం పదవి నుంచి కేజ్రీవాల్‌ని తొలగించాలని పిటిషన్, తిరస్కరించిన కోర్టు
Arvind Kejriwal Arrest: కేజ్రీవాల్‌ని సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్‌ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
Arvind Kejriwal Removal: లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని ఆ పదవి నుంచి తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే..ఈ పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. విచారణకు అంగీకరించలేదు. ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయం అని, అది కోర్టు నిర్ణయించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. గతంలోనూ ఇదే తరహా పిటిషన్ దాఖలైంది. అప్పుడు కూడా కోర్టు విచారణకు ఒప్పుకోలేదు. కోర్టులో పిటిషన్ వేసే బదులు రాజ్యాంగ నిపుణులను కలిసి మాట్లాడడం మంచిదని సూచించింది. కేవలం వ్యక్తిగత అభిప్రాయాలతో ఇలాంటివి డిమాండ్ చేయడం సరికాదని తెలిపింది. ఇది పూర్తిగా కేజ్రీవాల్ వ్యక్తిగతమైన విషయమని తేల్చి చెప్పింది. హిందూసేన జాతీయ అధ్యక్షుడు, సోషల్ వర్కర్ విష్ణు గుప్త ఈ పిటిషన్ వేశారు. కోర్టు తిరస్కరించిన వెంటనే గుప్త తన పిటిషన్‌ని ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ని కలిసి ఈ విషయం వివరిస్తానని వెల్లడించారు. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఢిల్లీలో ప్రభుత్వం లేకుండా పోయిందని పిటిషనర్ పేర్కొన్నారు. మార్చి 28వ తేదీన సుర్జిత్ సింగ్ యాదవ్ ఇదే తరహా పిటిషన్ వేయగా కోర్టు కొట్టి వేసింది. ఇలాంటి వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోదని తేల్చి చెప్పింది.
"ఓ కోర్టు రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన విధించాలని ఎప్పుడైనా తీర్పునిచ్చిందా..? అలా ఆదేశాలిచ్చిందా..? అలాంటిది ఎప్పుడైనా జరిగి ఉంటే ఆ వివరాలు ఇవ్వండి. అయినా ఇది పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయం. రాష్ట్రపతి లేదా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో ప్రభుత్వం పని చేయడం లేదని మేమెలా నిర్ణయించగలం..? ఇది పూర్తిగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పరిధిలోని అంశం. ఆయనకు మేం సూచనలు చేయాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం ఆయన ఏం చేయాలో అదే చేస్తారు"
- ఢిల్లీ హైకోర్టు
బెయిల్ కోసం కేజ్రీవాల్ పోరాటం..
ప్రస్తుతం కేజ్రీవాల్ లీగల్ టీమ్ కోర్టులో తమ వాదనలు వినిపిస్తోంది. ఆయనను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ...అటు ఈడీ మాత్రం ఈ బెయిల్ పిటిషన్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అసలు ఈ లిక్కర్ పాలసీ స్కామ్ సూత్రధారే కేజ్రీవాల్ అని తేల్చి చెప్పింది. అయినా ఇంకా విచారణ పూర్తి కాకుండానే బెయిల్ ఎలా అడుగుతున్నారంటూ మండి పడింది. ఆప్ మాత్రం ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపిస్తోంది. కేవలం ఎన్నికల ముందు ఆప్‌ని ముక్కలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ ప్రజలకు నిజానిజాలేంటో తెలుసని, కచ్చితంగా వాళ్ల మద్దతు తమకే ఉంటుందని తేల్చి చెబుతోంది. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆప్ తరఫున గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల హామీలను ఇటీవల ప్రకటించారు. బీజేపీ కుట్రని తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read: Viral Video: అటవీ అధికారులపై చిరుత దాడి, కర్రలతో కొట్టి బంధించిన వీడియో వైరల్