నీటి వాటా కోసం ఢిల్లీ న్యాయపోరాటం, సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఆప్ సర్కార్
Delhi Water Crisis: ఢిల్లీ ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్న క్రమంలో హరియాణా నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.
Delhi News: ఢిల్లీలో బెంగళూరు తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి. నీటికి అల్లాడిపోతున్నారు (Water Crisis in Delhi) దేశ రాజధాని వాసులు. ఇప్పటికే ఎండలతో సతమతమయ్యారు. ఇప్పుడు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యమునా నదీ నీటి మట్టం తగ్గిపోవడం వల్ల రోజువారీ అవసరాలకు ఉన్న నీళ్లు చాలడం లేదు. హరియాణా నుంచి రావాల్సిన నీటి వాటా రాలేదని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. హరియాణా, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎక్కువ మొత్తంలో నీరు విడుదల చేసేలా చొరవ చూపించాలని కోరింది. మరో నెల రోజుల పాటు నీళ్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. పలు కీలక ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. అంత ఎండలోనూ అందరూ రోడ్లపైకి వచ్చి నీళ్ల ట్యాంకర్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కనీసం ఓ బిందె నిండా అయినా నీళ్లు దొరికితే చాలనుకుంటున్నారు. ఆ ట్యాంకర్‌లు కూడా పూర్తి స్థాయిలో అందరి నీటి అవసరాలు తీర్చలేకపోతున్నాయి.
ఢిల్లీలో గరిష్ఠంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. అటు వాతావరణ విభాగం కీలక విషయం వెల్లడించింది. మరి కొద్ది రోజుల పాటు వడగాలులు వీచే అవకాశముందని స్పష్టం చేసింది. వీలైనంత వరకూ ప్రజలు ఇంట్లోనే ఉండాలని, హైడ్రేటెడ్‌గా ఉండాలని సూచించింది.