Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన
Delhi Commission For Women: అత్యాచార బాధితులకు తప్పనిసరిగా HIV టెస్ట్‌లు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ సూచించింది.
Delhi Commission For Women:
HIV టెస్ట్ చేయాల్సిందే..
అత్యాచార బాధితులకు తప్పనిసరి HIV టెస్ట్ చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) దేశ రాజధానిలోని అన్ని ఆసుపత్రులకూ సూచించింది. చాలా వరకు హాస్పిటల్స్‌లో...అత్యాచార బాధితులకు HIV పరీక్ష చేయకపోవడాన్ని గుర్తించిన కమిషన్...ఈ సూచనలు చేసింది. "అలాంటి దాడికి గురై ఆసుపత్రికి వస్తే మొట్టమొదటి సారే HIV టెస్ట్ చేయాలి. మూడు, ఆర్నెల్లకోసారి హాస్పిటల్‌కు వచ్చేలా వాళ్లే ప్రత్యేకంగా చొరవ చూపించాలి" అని మహిళా కమిషన్ సూచించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య విభాగానికి నోటీసులు కూడా పంపింది. అత్యాచారానికి గురైన వారితో పాటు...ఆ ముప్పు నుంచి తప్పించుకున్న వాళ్లలో ఎంత మందికి HIV టెస్ట్‌లు చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని కోరింది. అసలు ఈ పరీక్ష చేసేందుకు ఎలాంటి SOP అనుసరిస్తున్నారో చెప్పాలని అడిగింది. HIVవ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కూడా చెప్పాలని తెలిపింది. ఈ వివరాలు సేకరించిన ఢిల్లీ మహిళా కమిషన్...చాలా ఆసుపత్రుల్లో ఈ పరీక్ష చేయటం లేదని గుర్తించింది. దీప్ చంద్ హాస్పిటల్ బంధు హాస్పిటల్ గురించి ప్రస్తావించింది. అత్యాచార బాధితుల్లో చాలా తక్కువ మందికి HIV పరీక్షలు చేస్తున్నారని వెల్లడించింది.
ప్రమాణాలు పాటించటం లేదు..
కొన్ని చోట్ల ప్రమాణాలు పాటించకుండానే పరీక్షలు చేస్తున్నారని గుర్తించింది ఢిల్లీ మహిళా కమిషన్. ఆ టెస్ట్ ఫలితాలను కాన్ఫిడెన్షియల్‌గా ఉంచడంలోనూ విఫలమవుతున్నాయని వివరించింది. కొన్ని హాస్పిటల్స్‌లో ఆయా బాధితుల రికార్డ్‌లు కూడా ఉండట్లేదని, ఆ టెస్టింగ్ రికార్డులను భద్రపరుచుకోవాలని సూచించింది. అటు ఢిల్లీ పోలీసులకు కూడా కొన్ని సూచనలు చేసింది. పోలీసులు, ప్రభుత్వం అత్యాచార బాధితులకు సరైన వైద్యం అందేలా చూడాలని కోరింది. బాధితులకు సరైన పద్ధతిలో వైద్యపరీక్షలు నిర్వహించాలని స్టాండింగ్ ఆర్డర్ నంబర్ 303 చెబుతోందని గుర్తు చేసింది.
లక్షలాది మందికి ఈ వ్యాధి..
చికిత్సే లేని భయంకర రోగం హెచ్ఐవీ. చాప కింద నీరులా మనదేశంలో లక్షల మందికి సోకింది ఈ వ్యాధి. అసురక్షిత లైంగిక కార్యకలాపాల వల్లే సోకినట్టు చెబుతోంది జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ. గత పదేళ్లలో కొత్తగా ఎయిడ్స్ బారిన పడిన వారి సంఖ్య పదిహేడు లక్షలుగా తేలింది. మధ్యప్రదేశ్ కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ హెచ్ఐవీ బాధితులు దేశంలో ఎంత మంది ఉన్నారో? కొత్తగా ఎంతమందికి
ఆ వ్యాధి సోకిందో వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. అందులో 2011-2021 మధ్యకాలంలో 17,08,777 మంది అసురక్షిత సెక్స్ ద్వారా హెచ్ఐవీ బారిన పడినట్టు నివేదిక ద్వారా తెలిసింది. అయితే గతంతో పోలిస్తే హెచ్ ఐవీ సోకుతున్న రేటు కాస్త నెమ్మదించిందనే చెప్పాలి. 2011-12లో 2.4 లక్షల మందికి హెచ్ఐవీ సోకింది. అదే 2020-21 మధ్య కాలంలో 85,268 మంది ఎయిడ్ బారిన పడినట్టు గుర్తించారు. 2011-12 నుంచి 2020-21 వరకు అసురక్షితంగా రక్తం ఎక్కించడం, రక్తానికి సంబంధించిన చికిత్సల కారణంగా 15, 782 మందికి హెచ్ఐవీ సోకినట్టు నిర్ధారించారు. అంటే వీరు ఎలాంటి అసురక్షిత లైంగిక కార్యకలపాలకు పాల్పడకపోయినా కూడా చిన్నచిన్న పొరపాట్ల వల్ల వైరస్ బారిన పడ్డారు.