Delhi Air Pollution: ఇది కోర్టు పరిధిలోని అంశం కాదు, పరిష్కారమేంటో మీరే సూచించండి - ఢిల్లీ కాలుష్యం పిటిషన్‌పై సుప్రీం కోర్టు
Delhi Air Pollution: ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది.
Supreme Court on Delhi Air Pollution:
పొల్యూషన్ కట్టడి చేయాలని పిటిషన్..
ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు తిరస్కరించింది. పంజాబ్, హరియాణాలో రైతులు గడ్డి కాల్చుతున్నారని, దాన్ని నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలు వెలువరించాలని సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం "ఇది కోర్టులో విచారించాల్సిన అంశం కాదు' అని తేల్చి చెప్పింది. ఆ సమస్యకు సరైన పరిష్కారాలుంటే వాటిని సూచించాలని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ పర్దివాలాతో కూడినత్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. "కేవలం గడ్డి కాల్చటం ఆపేసినంత మాత్రాన కాలుష్యం తగ్గిపోతుందా" అని ఈ పిటిషన్ వేసిన లాయర్ శశాంక్ శేఖర్ ఝా ను ప్రశ్నించింది.
అంతే కాదు. ఈ సమస్యకు పరిష్కారమేంటో కూడా సూచించాలని అడిగింది. "గడ్డి కాల్చటాన్ని నిషేధిస్తాం సరే. కానీ...నిషేధించినంత మాత్రాన ఆగిపోతుందా..? ప్రతి రైతుపైనా ఆ నిబంధనను బలవంతంగా రుద్దుదామా..? ఇది కాకుండా ఇంకేమైనా పరిష్కారాలు ఉన్నాయేమో చూడండి. కొన్ని కోర్టు పరిధిలో చర్చించేవి కొన్ని ఉంటాయి. చర్చించలేనివీ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ అంశం కోర్టులో విచారించదగింది కాదు" అని ధర్మాసనం వెల్లడించింది.
అన్నీ బంద్ చేయాలి..
అన్ని స్కూల్స్, కాలేజ్‌లతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీస్‌లు కూడా పూర్తిగా ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు లాయర్ శశాంక్. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో కమ్ముకుంటున్నకాలుష్యంతో ఏటా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, జీవించే హక్కు కోల్పోతున్నారని వాదించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు మాజీ జడ్జ్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీనివేయాలని అడిగారు. కానీ...సుప్రీం కోర్టు మాత్రం వీటిని పరిగణనలోకి తీసుకోలేదు.
ఇప్పటికే కట్టడి చర్యలు..
ఢిల్లీలో ప్రైమరీ స్కూల్స్‌ను మూసివేశారు. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో...ఈ నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మరో కీలక ప్రకటన కూడా చేశారు. దాదాపు 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటినుంచే పని చేస్తారని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కూడా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించే ఆలోచన చేయాలని సూచించారు. బీఎస్-6 వాహనాలకు తప్ప మిగతా వెహికిల్స్ రోడ్‌పైన తిరిగేందుకు అనుమతి లేదని వెల్లడించారు. కేవలం డీజిల్‌తో నడిచే లైట్ మోటార్ వెహికిల్స్‌కు పర్మిషన్ ఉంటుంది చెప్పారు. "పర్యావరణ్ బస్ సర్వీస్"లో భాగంగా 500 ప్రైవేట్ సీఎన్‌జీ బస్‌లను నడుపుతున్నట్టు తెలిపారు. ప్రజలు సొంత వాహనాలు పక్కన
పెట్టి ఈ ప్రజా రవాణాను వినియోగించాలని సూచించారు. మార్కెట్‌లు, ఆఫీస్‌లు ఎప్పటి వరకూ తెరిచి ఉండాలన్నది రెవెన్యూ కమిషనర్లు నిర్ణయిస్తారని అన్నారు. ఢిల్లీలోని హాట్‌స్పాట్‌ల వద్ద స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లను నియమించి కాలుష్య కట్టడికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రమాదకరమైన PM 2.5 కాలుష్యానికి...పంజాబ్‌లో రైతులు గడ్డి కాల్చటమే కారణమని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే...దేశ రాజధానిలో 34% మేర కాలుష్యం నమోదవుతోందని పేర్కొన్నారు.
Also Read: Rajnath Singh: ఏ నిముషానికి ఏమి జరుగునో, యుద్ధానికి సిద్ధమవండి - సైన్యానికి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలు