Weather Latest Update: పెను తుపానుగా మారబోతున్న మోచా- తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎంత?
బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న తుపాను ఉత్తర దిశగా కదులుతోంది. మయన్మార్ వైపు దూసుకెళ్తున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఏర్పడిన అల్పపీడం ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా మారుబోతోంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. అనంతరం తుపానుగా మారి మయన్మార్ వైపు దూసుకెళ్తుంది.
బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న తుపాను(Mocha Cyclone ) ఉత్తర దిశగా కదులుతోంది. మయన్మార్ వైపు దూసుకెళ్తున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకే తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతోంది.
Synoptic features of weather inference of Andhra Pradesh dated 07.05.2023#IMD#APforecast#MCAmaravati#APweather pic.twitter.com/Zog5w8imvY
— MC Amaravati (@AmaravatiMc) May 7, 2023
ప్రస్తుతం అల్పపీడనంగా బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వేళ తెలుగు రాష్ట్రాలకు అకాల వర్షం ముప్పు ఇంకా పొంచి ఉంది. మరోవైపు విండ్ డిస్‌కంటిన్యూటీ కూడా వర్షాలకు కారణమవుతోంది. రాయలసీమ జిల్లాలతోపాటు దక్షిణ తెలంగాణ, కోస్తాంధ్రలో పరిస్థితి ఇలానే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ జిల్లాలైన కడప, అనంతపురం, సత్యసాయి జిల్లా, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వర్షాల దంచి కొట్టనున్నాయి. తొమ్మిదో తేదీ వరకు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. కోస్తాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి.
తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. 9 తేదీ రాత్రి వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్, వికారబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, జయశంకర్ భూపాల్‌పల్లి, నారాయణ పేట, జోగులాంబ, ఆదిలాబాద్, అశ్వరారావుపేటలో వర్షాలు పడనున్నాయి. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. అందుకే ప్రజలంతా అప్రమతంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలియజేశారు.
మోచా తుపాను(Mocha Cyclone ) బలమైన అల్పపీడనంగా ఉందని... 9వ తేదీ నాటికి తీవ్ర వాయగుండంగా మారుతుంది. 10 తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. 11, 12 నాటికి తీవ్ర తుపానుగా మారుతుంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్‌పై ఎక్కువగా ఉంటుంది. అయితే తుపానుగా మారే నాటికి మయన్మార్ వైపు వెళ్లిపోనుందీ మోచా. 14వ తేదీ నాటికి అతి పెను తుపానుగా మారుబోతోంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 7, 2023
తుపాను ఈ వారంలో పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బెంగాల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
11వ తేదీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పారు. 10 వతేదీ నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. 11 తర్వాత విపరీతమైన వడగాల్పులు ప్రజలను ఊపిరి ఆడనీయకుండా చేస్తాయట.
థార్ ఎడారి నుంచి వచ్చే గాలులు ప్రభావం తెలుగు రాష్ట్రాలపై విపరీతంగా ఉండబోతోంది. దీని వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే ఛాన్స్ ఉంది.
ఐఎండీ హెచ్చరికతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. 'మోచా' తుపానుకు సంబంధించి ఒడిశాలోని 18 జిల్లాల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాను, పిడుగుల హెచ్చరికలతో 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.