Sourav Ganguly: త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీ, పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ చర్చ
Sourav Ganguly: త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీని నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.
Sourav Ganguly Brand Ambassador:
పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా..
ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కేప్టెన్ సౌరవ్ గంగూలీకి కీలక బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ఈ విషయం అధికారికంగా వెల్లడించారు. గంగూలీకి కాల్ చేసి మాట్లాడిన ఆయన...రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో దాదా కీలక పాత్ర పోషిస్తారన్న నమ్మకముందని వెల్లడించారు. తమ నిర్ణయానికి గంగూలీ అంగీకారం తెలిపారని సంతోషం వ్యక్తం చేశారు.
"ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కేప్టెన్ సౌరవ్ గంగూలీ మా మాటకు, నిర్ణయానికి గౌరవమివ్వడం చాలా సంతోషంగా ఉంది. త్రిపుర పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలన్న మా ప్రతిపాదనకు ఆయన అంగీకరించారు. ఇదే విషయమై ఆయనతో నేను ఫోన్‌లో మాట్లాడాను. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారన్న నమ్మకముంది"
- డాక్టర్ మాణిక్ సాహా, త్రిపుర ముఖ్యమంత్రి
బీజేపీకి దగ్గరవుతున్న దాదా..
త్రిపుర పర్యాటక మంత్రి సుశాంత చౌదరి గంగూలీ ఇంటికి వెళ్లి కలిశారు. ఆయనతో పాటు మరి కొందరు దాదాను కలిసి అభినందనలు తెలిపారు. సుశాంత చౌదరితో కాసేపు మాట్లాడిన గంగూలీ...ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్టు చెప్పారు. ఎప్పుడు పిలిచినా ఆ రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు దాదా. గంగూలీ త్వరలోనే విదేశాల్లో పర్యటించనున్నారు. ఆ టూర్ పూర్తైన తరవాత త్రిపురకు వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం...జూన్ నెలాఖరుకి త్రిపురకు వెళ్తారు. త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇకో టూరిజం, టీ టూరిజం లాంటి కొత్త విధానాలతో అందరినీ ఆకర్షించింది. అయితే..ఈ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే వెస్ట్‌బెంగాల్‌లోని హుగ్లీలో బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచి సందడి చేశారు. ఈ హడావుడి కారణంగా...మరోసారి దాదా పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. చాలా రోజులుగా బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు గంగూలీ. 2021లో జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లోనే సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ...రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు దాదా.
ఇదీ జరిగింది..
2019లో సౌరవ్ గంగూలీని BCCI ప్రెసిడెంట్‌గా నియమించారు. అప్పుడే దాదా పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన బీజేపీ తరపున ప్రచారం చేయడమే కాకుండా..పోటీ కూడా చేస్తారని కూడా అన్నారు. కానీ...ఆ తరవాత దాదా క్లారిటీ ఇచ్చారు. ఆ తరవాత 2021లో గంగూలీకి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు కేంద్రహోం మంత్రి అమిత్‌షా స్వయంగా వెళ్లి పరామర్శించారు. డిన్నర్ కూడా చేశారు. 2021లో బెంగాల్‌లో ఎన్నికలు జరిగాయి. కానీ...దాదా మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అందరూ అనుకున్నట్టుగా బీజేపీలో చేరలేదు. అయితే..ఎప్పుడైతే బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఆయన పదవీ కాలం ముగిసిందో..అప్పుడు మరో చర్చ మొదలైంది. ఆయన బీజేపీలో చేరలేదు కాబట్టే ఆయనను పదవిలో కొనసాగించలేదని TMC పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే..ఇప్పుడు త్రిపుర పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మరోసారి దాదా రాజకీయాల్లోకి వస్తారా..? అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Also Read: New Parliament Opening: కొత్త పార్లమెంట్ ఓపెనింగ్‌పై విపక్షాల విమర్శలు, BRS సహా పలు పార్టీలు బైకాట్